రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
ఉద్యోగుల తొలగింపులకు బ్రేక్:
ప్రభుత్వ జోక్యంతో తాత్కాలిక నిలిపివేత
అమెరికాకు చెందిన మెడికల్ కోడింగ్ సంస్థ కరోహెల్త్ కేరళలో తీసుకున్న ఆకస్మిక నిర్ణయం పెద్ద కలకలం రేపింది. కొచ్చి, కోజికోడ్ కేంద్రాలను ఒక్కసారిగా మూసేస్తున్నట్లు ప్రకటించడంతో దాదాపు 900 మంది ఉద్యోగులు ఒకేరోజు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది.
ఉదయం షిఫ్ట్‌కు హాజరైన ఉద్యోగులను ఆఫీసు గేట్ల వద్దే ఆపేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆఫీసులో ఉన్న సిబ్బందిని కూడా బయటకు పంపించి, తమ ఐడీ కార్డులు సమర్పించాలని, రిలీవింగ్ లెటర్లు తీసుకుని వెళ్లిపోవాలని కంపెనీ ప్రతినిధులు సూచించినట్లు ఉద్యోగులు ఆరోపించారు.
ఉద్యోగుల ప్రకారం, కరోహెల్త్ మూడు నెలల జీతాన్ని పరిహారంగా చెల్లిస్తామని తెలిపింది. అయితే ఇది సరిపోదని భావించిన ఉద్యోగులు కనీసం పది నెలల సెవరెన్స్ ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కంపెనీ కేరళలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు చెబుతూనే, మరోవైపు హైదరాబాద్‌లో కొత్త రిక్రూట్మెంట్లు కొనసాగుతున్నాయని ఉద్యోగులు ఆరోపించడం వివాదాన్ని మరింత తీవ్రతరం చేసింది.
ఒక రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యోగాలను తొలగిస్తూ, మరో రాష్ట్రంలో కొత్త నియామకాలు చేపడుతున్న కరోహెల్త్ విధానంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కంపెనీ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు, స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ఎమ్మెల్యే ఉమా థామస్, మంత్రి సన్నీ జోసెఫ్, లేబర్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారులు కంపెనీ ప్రతినిధులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్లు, కంపెనీ నిర్ణయాలపై రెండు వైపుల నుంచి వాదనలు వినిపించాయి.
ఈ చర్చల అనంతరం కరోహెల్త్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల తొలగింపు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఉద్యోగులు యథావిధిగా పనికి హాజరుకావచ్చని, వారి శాలరీలు, ఇతర సౌకర్యాల్లో ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల్లో కొంత ఊరట నెలకొంది.
అయితే కరోహెల్త్ కేరళలో తమ కార్యకలాపాల భవిష్యత్తుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తదుపరి చర్చల అనంతరం మాత్రమే పూర్తి స్థాయి నిర్ణయం ప్రకటిస్తామని కంపెనీ పేర్కొంది. ఈ పరిణామాల నేపథ్యంలో కేరళలో ఐటి, మెడికల్ కోడింగ్ రంగాల్లో ఉద్యోగ భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.







