బంగాళాఖాతంపై పాక్‌ కన్ను.. హంగోర్‌ జలాంతర్గాములతో మోహరింపు యోచన

ఇంటర్నెట్‌ డెస్క్‌: 1971 ఇండియా–పాక్‌ యుద్ధం తర్వాత బంగాళాఖాతంలోకి పాకిస్థాన్‌ నేవీ అడుగుపెట్టలేదు. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధంలో భారత నౌకాదళ సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన పాక్‌ అప్పటి నుంచి ఆ జలాల్లోకి రావడాన్ని మానేసింది. అయితే ఇన్నేళ్ల తర్వాత మళ్లీ బంగాళాఖాతంపై పాకిస్థాన్‌ దృష్టి పడినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. కొత్తగా హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను నౌకాదళంలో చేర్చుకుంటూ, వాటిని బంగాళాఖాతంలో మోహరించే ఆలోచనలో ఉందని అక్కడి నేవీ సీనియర్‌ అధికారి వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.

పాకిస్థాన్‌ నేవీ తమ సామర్థ్యాన్ని విస్తరించేందుకు చైనా నుంచి 8 హంగోర్‌ శ్రేణి సబ్‌మెరైన్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. వీటిలో ఒకటి ఇటీవల చైనా నుంచి పాక్‌కి చేరింది. ఆ జలాంతర్గామికి ఎస్కార్ట్‌గా ఉన్న ఫ్లోటిల్లా నౌక కమాండర్‌, కమోడోర్‌ ఒమర్‌ ఫరూఖీ మార్గమధ్యంలో శ్రీలంకలో ఆగిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములతో మా దేశ నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరించనుంది. వీటితో మేం బంగాళాఖాతంలోనూ మా సైనిక శక్తిని మోహరించే అవకాశం దక్కుతుంది. ఇవి గేమ్‌ఛేంజర్‌ సబ్‌మెరైన్లు.

ఈ వ్యాఖ్యలతో హంగోర్‌ జలాంతర్గాములను పాక్‌ బంగాళాఖాతంలో మోహరించే అవకాశం ఉందన్న అభిప్రాయాలు బలపడుతున్నాయి.

బంగాళాఖాతం ఏ ఒక్క దేశానికి ప్రాదేశిక సముద్రం కాదు. భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, ఇండోనేసియా, శ్రీలంక తీర దేశాలుగా ఉన్నాయి. తీరరేఖ నుంచి 12 నాటికల్‌ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలుగా, 200 నాటికల్‌ మైళ్ల వరకు ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌గా గుర్తింపు ఉంటుంది. ఆ దాటి అంతర్జాతీయ జలాలు మొదలవుతాయి. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా సంచరించవచ్చు.

అయితే బంగాళాఖాతం భారత్‌ దృష్టిలో వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. తూర్పు నావెల్‌ కమాండ్‌ ఇక్కడే ఉండడం, అణు జలాంతర్గాముల నిర్మాణానికి విశాఖపట్నం కేంద్రంగా ఉండటం, జలాంతర్గాముల నిల్వకు ఐఎన్‌ఎస్‌ వర్ష వంటి సదుపాయాలు ఉండటం వల్ల ఈ ప్రాంత ప్రాధాన్యం మరింత పెరిగింది. గతంలో విశాఖలో పాక్‌ గూఢచారులు అరెస్టు కావడం, కీలక కమ్యూనికేషన్‌ లైన్లు, బంగ్లాదేశ్‌ సహా పలు దేశాలతో వాణిజ్య మార్గాలు ఇక్కడి గుండా సాగడం వంటి అంశాలు కూడా ఈ ప్రాంతాన్ని సున్నితంగా మారుస్తున్నాయి.

భారత నౌకాదళ బలం ముందు పాక్‌ నేవీ సామర్థ్యం తక్కువే. భారత్‌ వద్ద శక్తివంతమైన విమాన వాహక నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా, పాకిస్థాన్‌ చైనా, తుర్కియే తయారీ నౌకలపై ఆధారపడుతోంది. టైప్‌054ఏ/పీ ఫ్రిగేట్లు, మిల్జెమ్‌ కార్వెట్లతో పాటు ఇప్పుడు హంగోర్‌ శ్రేణి సబ్‌మెరైన్లను చేర్చుకుంటోంది. అయినప్పటికీ బంగాళాఖాతంలో పాక్‌ మోహరింపులు భారత్‌కు వ్యూహాత్మక చికాకులు తెచ్చే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య మైత్రి బలపడుతోంది. 1971 యుద్ధం తర్వాత చల్లబడిన సంబంధాలు, 2024లో షేక్‌ హసీనా సర్కారు కూలిన తర్వాత మళ్లీ పునరుద్ధరించుకునే దిశగా కదులుతున్నాయి. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు, ద్వైపాక్షిక వాణిజ్యం, సైనిక సహకారం పెరుగుతున్నాయి. కరాచీ–ఛట్టోగ్రామ్‌ మధ్య సముద్ర వాణిజ్యం ప్రారంభం, పీఎన్‌ఎస్‌ సైఫ్‌ ఛట్టోగ్రామ్‌ తీరంలో నాలుగు రోజులు మోహరించడం వంటి పరిణామాల నేపథ్యంలోనే పాక్‌ బంగాళాఖాతంపై చూపుతున్న ఆసక్తి ప్రాధాన్యం సంతరించుకుంది.

హంగోర్‌ శ్రేణి జలాంతర్గాములను చైనా ఎయిర్‌ ఇండిపెండెంట్‌ ప్రొపల్షన్‌ టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. సాధారణ డీజిల్‌–ఎలక్ట్రికల్‌ సబ్‌మెరైన్ల కంటే ఇవి ఎక్కువకాలం నీటి లోపలే ఉండగలవు. దీంతో వాటిని గుర్తించడం, ట్రాక్‌ చేయడం కష్టతరమవుతుంది. 1971 యుద్ధంలో పీఎన్‌ఎస్‌ హంగోర్‌ టోర్పిడో దాడితో ఐఎన్‌ఎస్‌ ఖుక్రీని ముంచిన ఘటనకు ఈ పేరుకు ప్రత్యేక చారిత్రక నేపథ్యం ఉంది. ఆ తర్వాత భారత నేవీ పీఎన్‌ఎస్‌ ఘాజీని పేల్చివేసి పాక్‌ నేవీకి గట్టి దెబ్బతీసింది. అదే యుద్ధం తర్వాత బంగాళాఖాతంలో పాక్‌ నేవీ కనిపించకపోవడం గమనార్హం. ఇప్పుడు హంగోర్‌ శ్రేణి జలాంతర్గాముల మోహరింపు యోచనతో పాక్‌ మళ్లీ ఆ జలాలపై కన్నేసింది.