ఢిల్లీ వేదికగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసనలు కొత్త మలుపు తిరిగాయి. నేటితో ఈ ఆందోళన 32వ రోజుకు చేరుకోగా, ఉద్యమకారులు తమ డిమాండ్ల జాబితాను విస్తరించారు. ముఖ్యంగా జూలై 20న జరిగిన నిరసనల్లో పాల్గొన్న శాంతియుత ఉద్యమకారులపై ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకూడదని, వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకూడదని తాజా డిమాండ్‌గా ముందుకు తెచ్చారు.

ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడిన పార్టీ ప్రతినిధి అశుతోష్ రాంకా, శాంతియుత నిరసనకారుల భద్రతపై పార్టీ వైఖరిని స్పష్టం చేశారు.

“శాంతియుతంగా నిరసన తెలిపినా తమను ఎక్కడ లక్ష్యంగా చేసుకుంటారోనని చాలామంది ఆందోళన చెందుతున్నారు. కానీ శాంతియుతంగా నిరసన తెలిపిన వారిపై ఎలాంటి చర్యలు లేకుండా మేం చూసుకుంటాం. మీకంటే ముందే మేం అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నాం”

ప్రస్తుతం ఈ పోరాటం నాలుగు ముఖ్యమైన డిమాండ్ల చుట్టూ కొనసాగుతోందని రాంకా తెలిపారు. సోనమ్ వాంగ్‌చుక్ విడుదల, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ఆత్మహత్య చేసుకున్న NEET అభ్యర్థుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం చెల్లించడం, జూలై 20నాటి నిరసనకారులపై ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడం తమ ప్రధాన డిమాండ్లని ఆయన ప్రకటించారు.

ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నించిన కొద్దీ అది మరింత బలపడుతోందని, విద్యార్థులకు నిరసనలు తెలపడం రాదని భావించినవారికి ఈ పోరాటమే సమాధానమని రాంకా వ్యాఖ్యానించారు. జూలై 20న జరిగిన ఘటనలను గుర్తుచేస్తూ, ఆ రోజు పోలీసుల చర్యలు, టెంట్లు వేయకుండా విధించిన ఆంక్షలతో నిరసనలు ముగిసిపోతాయని అధికారులు భావించారని ఆయన ఆరోపించారు.

“ఆ రోజు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించి, టెంట్లు వేయనివ్వకపోతే ఉద్యమం ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈ ఆందోళన వంద రెట్లు పెద్దదిగా మారింది”

ఆ రోజు ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరును ప్రపంచమంతా చూసిందని రాంకా విమర్శించారు. ప్రభుత్వం అహంకారాన్ని దించేందుకే ఈ నిర్ణయాత్మక పోరాటం కొనసాగుతున్నదని ఆయన పిలుపునిచ్చారు. నిన్నటివరకు తమను ‘బొద్దింకలు’, ‘వైరస్’ అని అవమానించిన ప్రభుత్వమే ఇప్పుడు దిగివచ్చిందని, ప్రజలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రారంభించారని, ఇదే తమ నిరసన సాధించిన అతిపెద్ద విజయమని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించి సీజేపీతో తొలిసారిగా అధికారిక చర్చలు ప్రారంభించిన రెండు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. గత సోమవారం సీజేపీ ప్రతినిధులు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లను కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఢిల్లీలోని తన నివాసానికి ఆహ్వానించి చర్చలు జరిపారు. ఈ భేటీలో తమ డిమాండ్లను వివరించే లిఖితపూర్వక వినతిపత్రాన్ని సీజేపీ ప్రతినిధులు జేపీ నడ్డాకు అందజేశారు.

ఈ వినతిపత్రంపై BJP అగ్రనాయకత్వంతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం అవసరమని జేపీ నడ్డా ఇప్పటికే సీజేపీ ప్రతినిధులకు తెలియజేసినట్లు రాంకా వెల్లడించారు. కేంద్రం స్పందన, చర్చల పురోగతి, అలాగే కొత్తగా ప్రకటించిన డిమాండ్లపై సీజేపీ తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది.