హాస్టల్‌లో గదిలో విషాదం..

నలుగురు విద్యార్థినులను కాటేసిన పాము

ఝార్ఖండ్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాల బాలికల హాస్టల్‌ లోకి పాము రావడం తీవ్ర కలకలం రేపింది. హాస్టల్ గదిలోకి దూరిన విషపూరిత కట్లపాము.. నిద్రలో ఉన్న నలుగురు విద్యార్థినులను కాటేసింది. ఈ ఘటనలో 13 ఏళ్ల విద్యార్థిని మృతిచెందగా, మరో ముగ్గురు బాలికలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. 

లోహర్‌దగా జిల్లాలోని సన్‌వసిరా హయ్యర్‌ సెకండరీ రెసిడెన్షియల్‌ స్కూల్ హాస్టల్‌లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాత్రి 11 గంటల సమయంలో బాలికలు నిద్రిస్తున్న గదిలోకి వచ్చిన పాము.. తొలుత ఓ అమ్మాయిని కాటేసింది. దీంతో ఆమె గట్టిగా కేకలు వేసింది. అదే గదిలో నిద్రిస్తున్న మరో ముగ్గురు విద్యార్థినులు లేచి చూసేసరికి వారినీ పాము కాటేసింది. వీరి అరుపులు విన్న హాస్టల్‌ సిబ్బంది.. వెంటనే విద్యార్థినులను ఆసుపత్రికి తరలించారు. అప్పటికే బాధితుల్లో ఓ విద్యార్థిని మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మిగతా బాలికలు చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఒక విద్యార్థిని ప్రాణం పోయిందని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.