దేశవ్యాప్తంగా రోజూ లక్షలాది మంది ఇండియన్ రైల్వేస్ ద్వారా ప్రయాణిస్తున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే పేద, మధ్యతరగతి ప్రయాణికులకు రైలు ప్రయాణం ఆర్థికంగా ఎంతో అనుకూలంగా ఉంటుంది. సాధారణ టిక్కెట్ ధరలతో పోలిస్తే కొన్ని వర్గాలకు ప్రత్యేక రాయితీలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా దివ్యాంగుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూనిక్ డిసేబిలిటీ ఐడీ (UDID) కార్డు ద్వారా రైల్వే టిక్కెట్లపై గణనీయమైన తగ్గింపులు పొందే అవకాశం ఉంది.

కొన్ని కేటగిరీల్లో UDID కార్డు కలిగిన దివ్యాంగులకు టిక్కెట్ ఛార్జీలపై 75 శాతం వరకు రాయితీ వర్తిస్తుంది. అంటే టిక్కెట్ ధర రూ.100 ఉంటే, అర్హత కలిగిన ప్రయాణికుడు కేవలం రూ.25 మాత్రమే చెల్లించి ప్రయాణం చేయవచ్చు. అయితే ఈ రాయితీ అందరికీ ఒకే విధంగా వర్తించదు. ప్రయాణికుడి వైకల్యం రకం, శాతం, ప్రయాణించే తరగతి వంటి అంశాలను బట్టి రాయితీ శాతం నిర్ణయించబడుతుంది.

సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలులో ఉన్న UDID పథకం ప్రధాన లక్ష్యం దేశంలోని అన్ని దివ్యాంగులకు ఒకే విధమైన గుర్తింపు కార్డు అందించడం. ఈ కార్డులో లబ్ధిదారుడి వ్యక్తిగత వివరాలు, వైకల్యం రకం, వైకల్యం శాతం వంటి సమాచారం నమోదు చేయబడుతుంది. దీంతో వేర్వేరు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతిసారి వైకల్య ధ్రువీకరణ పత్రాలు చూపాల్సిన అవసరం తగ్గుతుంది.

భారతీయ రైల్వే దివ్యాంగుల కోసం ప్రత్యేక రాయితీ విధానాన్ని అమలు చేస్తోంది. UDID కార్డు ఆధారంగా ప్రయాణికుడి అర్హతను పరిశీలించి టిక్కెట్ ఛార్జీలపై రాయితీ కల్పిస్తుంది. ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ సమయంలో కూడా అవసరమైన వివరాలు నమోదు చేసి ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. రైల్వే కౌంటర్ల వద్ద టిక్కెట్ తీసుకునే సమయంలో UDID కార్డు చూపించి రాయితీ పొందే అవకాశం ఉంది.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం సాధారణంగా 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు UDID కార్డుకు అర్హులు. సంబంధిత వైద్య మండలి ధ్రువీకరణ అనంతరం కార్డు జారీ చేస్తారు. దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, నివాస ధ్రువీకరణ, మొబైల్ నంబర్, వైకల్య ధ్రువీకరణ పత్రం వంటి పత్రాలు అవసరం అవుతాయి. అవసరమైతే వైద్య పరీక్ష కూడా నిర్వహిస్తారు.

UDID కార్డు కోసం అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పరిశీలన పూర్తయ్యాక ఆమోదం లభించిన తర్వాత కార్డు జారీ అవుతుంది. అనంతరం దానిని ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. UDID కార్డు ద్వారా రైల్వే రాయితీలతో పాటు స్కాలర్‌షిప్‌లు, సహాయక పరికరాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

అధికారులు, అర్హత కలిగిన దివ్యాంగులు వీలైనంత త్వరగా UDID కార్డు కోసం దరఖాస్తు చేసి, కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.