UPI వినియోగదారులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా నేషనల్ ప్రెమెంట్స్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (NPCI) కీలక నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చెల్లింపులను ఇంకా సులభతరం చేయాలనే ఉద్దేశంతో UPI PIN ఏర్పాటు విధానంలో మార్పులు చేసింది.

ఇప్పటివరకు UPI PIN సెట్ చేసుకోవడానికి తప్పనిసరిగా డెబిట్ కార్డ్ వివరాలు అవసరం అయ్యేవి. డెబిట్ కార్డ్ ద్వారా మాత్రమే PIN నమోదు చేసుకునే అవకాశం ఉండటంతో, కార్డు లేని వినియోగదారులు UPI సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని NPCI కొత్తగా ఆధార్ ఆధారిత OTP సౌకర్యాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై వినియోగదారులు తమ ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా కూడా UPI PIN సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

దీంతో డెబిట్ కార్డ్ లేని వారు కూడా సులభంగా UPI PIN ఏర్పాటు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా ఉన్నప్పటికీ డెబిట్ కార్డ్ తీసుకోని వినియోగదారులు, గ్రామీణ ప్రాంతాల్లో కార్డు వినియోగం తక్కువగా ఉన్న ఖాతాదారులకు ఈ మార్పు ఉపయోగకరంగా ఉండనుంది.

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం, బ్యాంకులు, NPCIలు చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ కొత్త సౌకర్యాన్ని అమలు చేస్తున్నారు. చిన్నచిన్న లావాదేవీల నుంచి పెద్ద మొత్తాల వరకు UPI ద్వారా చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో, PIN ఏర్పాటు ప్రక్రియను సులభతరం చేయడం అవసరమని భావిస్తున్నారు.

ఆధార్ OTP ద్వారా PIN సెట్ చేసుకునే అవకాశం కల్పించడం వల్ల, కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిపించుకున్నవారు, డెబిట్ కార్డ్ జారీకి వేచి ఉన్నవారు కూడా ఆలస్యం లేకుండా UPI సేవలను ప్రారంభించగలరు. దీంతో డిజిటల్ లావాదేవీల పరిధి మరింత విస్తరించే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు భావిస్తున్నాయి.

UPI ఆధారిత చెల్లింపులు ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్నాయి. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి దారులు, రోజువారీ లావాదేవీల్లో పాల్గొనే సాధారణ వినియోగదారులు పెద్ద సంఖ్యలో UPIపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో NPCI తీసుకున్న తాజా నిర్ణయం డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.