రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
యాడ్స్ ప్రవేశపెట్టడంపై వినియోగదారుల ఆగ్రహం
ప్రముఖ ఓటీటీ వేదిక ‘Amazon Prime Video’కు ఆస్ట్రేలియాలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్ట్రీమింగ్ సేవల మధ్యలో వాణిజ్య ప్రకటనలను ప్రవేశపెట్టడం, ప్రకటనలు లేకుండా సేవలు పొందాలంటే అదనపు రుసుము చెల్లించాలని వినియోగదారులపై నిబంధన విధించడం ఈ వివాదానికి కారణమైంది.
ఈ వ్యవహారాన్ని ఆస్ట్రేలియా కాంపిటీషన్ అండ్ కన్స్యూమర్ కమిషన్ (ACCC) తీవ్రంగా పరిగణించింది. Amazonపై ఫెడరల్ కోర్టులో దావా దాఖలు చేసింది. వార్షిక ప్రైమ్ subscription ఒప్పందాల్లో అమెజాన్ ఏకపక్ష నిబంధనలను చేర్చిందని, వినియోగదారులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సేవలలో కీలక మార్పులు చేసింది అని ACCC ఆరోపించింది.
ఈ మార్పుల ప్రభావం నవంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో దాదాపు 10 లక్షల మంది ప్రైమ్ వీడియో subscribers పై పడిందని కమిషన్ కోర్టుకు వివరించింది. 2024 నుంచి ప్రైమ్ వీడియో లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అమెజాన్ ప్రకటనలను ప్రారంభించిందని, దీంతో అప్పటికే ఏడాది మొత్తానికి సుబ్స్క్రిప్షన్ తీసుకున్న సుమారు 8.5 లక్షల మంది వినియోగదారులు ప్రకటనలతో కూడిన వీడియోలను చూడాల్సి వచ్చిందని పేర్కొంది.
ఒకవేళ ప్రకటనలు లేకుండా వీడియోలను చూడాలనుకుంటే, ఇప్పటికే చెల్లించిన subscription కి అదనంగా రుసుము చెల్లించాలని అమెజాన్ నిబంధన పెట్టిందని ACCC అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి రుసుము ముందుగానే చెల్లించిన వినియోగదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇలాంటి నియమాలు అమలు చేయడం అన్యాయమని కమిషన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఈ మార్పుల వల్ల నష్టపోయిన వినియోగదారులకు నష్టపరిహారం చెల్లించేలా అమెజాన్ ను ఆదేశించాలని ACCC ఫెడరల్ కోర్టును కోరింది. వినియోగదారుల హక్కులను ఉల్లంఘించే విధంగా ఒప్పంద నిబంధనలను మార్చడం, సేవల స్వరూపాన్ని ఏకపక్షంగా మార్చడం వంటి అంశాలపై కమిషన్ దావాలో ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం.
ఈ కేసు నేపథ్యంలో అమెజాన్ ఆస్ట్రేలియా వైపు నుంచి స్పందన కూడా వచ్చింది. సంస్థపై నమోదైన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోందని, సంబంధిత అధికారులకు తాము సహకరిస్తున్నామని అమెజాన్ ఆస్ట్రేలియా ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం ఈ కేసు ఫెడరల్ కోర్టులో విచారణ దశలో ఉంది. ఆస్ట్రేలియాలో డిజిటల్ సేవల రంగంలో వినియోగదారుల హక్కులు, subscription ఒప్పందాల పారదర్శకతపై ఈ కేసు కీలక తీర్పుకు దారితీసే అవకాశం ఉందని స్థానిక మీడియా విశ్లేషిస్తోంది.







