రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
ఓటీటీలోకి బ్లాక్‌బస్టర్ ‘దృశ్యం 3’
స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్, దర్శకుడు జీతూ జోసెఫ్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘దృశ్యం 3’ గత నెల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే 21, 2026న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రపంచవ్యాప్తంగా ‘దృశ్యం 3’ రూ.230 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ సర్కిల్స్ అంచనా వేస్తున్నాయి. దీంతో ‘దృశ్యం’ ఫ్రాంచైజీపై మరింత ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఈ సిరీస్‌కు గట్టి ఫ్యాన్ బేస్ ఉండటంతో, ఇప్పుడు ‘దృశ్యం 4’పై కూడా సినీ ప్రేక్షకుల్లో చర్చ మొదలైంది.
థియేట్రికల్ రన్‌ను దాదాపు పూర్తిచేసుకున్న ‘దృశ్యం 3’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు రానున్నట్లు సమాచారం. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తల ప్రకారం, జూన్ 18 లేదా జూన్ 25 నుంచి ‘దృశ్యం 3’ డిజిటల్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
అయితే ఓటీటీ విడుదల తేదీపై ఇప్పటివరకు చిత్ర నిర్మాణ సంస్థ గానీ,అమెజాన్ ప్రైమ్ వీడియో గానీ అధికారిక ప్రకటన చేయలేదు. ఈ కారణంగా సినిమా అభిమానులు, ముఖ్యంగా థియేటర్లలో చూడలేకపోయిన ప్రేక్షకులు, ఓటీటీ రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కథ విషయానికి వస్తే, వరుణ్ హత్య కేసు నుంచి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి జార్జ్‌కుట్టి కొత్త ప్లాన్‌తో ముందుకు వస్తాడు. తన గత కథనే సినిమాగా తీసి జీవితాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇందుకోసం ఓ రచయితతో కథ రాయించి, తానే నిర్మాతగా మారి ఆ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిపేస్తాడు. దీంతో జార్జ్‌కుట్టి జీవనశైలి పూర్తిగా మారిపోతుంది.
ఈ నేపథ్యంలో తన పెద్ద కుమార్తె పెళ్లి విషయంలో అతడు కొత్త సమస్యలను ఎదుర్కొంటాడు. ఎన్ని సంబంధాలు చూసినా వరుసగా రిజెక్ట్ అవుతుండటం కథలో సస్పెన్స్‌ను పెంచుతుంది. ఎవరో కావాలనే ఈ సంబంధాలను చెడగొడుతున్నారని జార్జ్‌కుట్టికి అర్థమవుతుంది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారనే రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేస్తాడు.
ఇదిలా ఉండగా, సహదేవ్ అనే కానిస్టేబుల్ జార్జ్‌కుట్టిని ఎందుకు నిరంతరం ఫాలో అవుతుంటాడు? కొడుకును కోల్పోయిన గీతా ప్రభాకర్ దంపతులు మళ్లీ ప్రతీకారం కోసం రంగంలోకి దిగారా? ఈసారి చట్టంలోని ఏ లోపాలను ఉపయోగించుకుని జార్జ్‌కుట్టి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు? అతడు ఆడిన మైండ్ గేమ్ అసలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ‘దృశ్యం 3’ మిగతా కథ.
థియేటర్లలో ఇప్పటికే మంచి విజయాన్ని అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ విడుదలతో మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకునే అవకాశం ఉంది. అధికారిక స్ట్రీమింగ్ తేదీపై స్పష్టత కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.







