రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో, జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన తాజా క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ‘దృశ్యం 3’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగులో కూడా విడుదలైన ఈ చిత్రం సమీక్షల పరంగా మిశ్రమ స్పందనను మాత్రమే అందుకున్నా, వసూళ్ల పరంగా మాత్రం బాక్సాఫీసు వద్ద దూసుకెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.
థియేటర్లలో విజయవంతమైన రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ‘దృశ్యం 3’ను జూన్ 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఆ ఓటీటీ సంస్థ శనివారం అధికారికంగా ప్రకటించింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఈ చిత్రం డిజిటల్‌గా అందుబాటులోకి రానుంది.
‘దృశ్యం 2’ ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే ‘దృశ్యం 3’ కథ మొదలవుతుందనే అంశం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది. వరుణ్ హత్య కేసులో జార్జ్ కుటుంబంపై ఉన్న ఆరోపణలను హైకోర్టు కొట్టేయడంతో వారికి పెద్ద ఉపశమనం లభిస్తుంది. గతంలో ఎదుర్కొన్న భయానక అనుభవాలను మరచిపోవడానికి ప్రయత్నిస్తూ ఆ కుటుంబం మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభిస్తుంది.
కొన్ని సంవత్సరాల తర్వాత జార్జ్ తన కుటుంబం ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ‘దృశ్యం’ పేరుతో సినిమా తీసి నిర్మాతగా నిలుస్తాడు. ఆ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో అతని జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఇదిలా ఉండగా, పెద్ద కుమార్తె అంజు వివాహం కోసం జార్జ్ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. అయితే ప్రతి సారి పెళ్లి సంబంధం కుదిరే దశకు రాగానే ఏదో ఒక కారణంతో ఆగిపోవడం అతనిలో అనుమానాలను రేకెత్తిస్తుంది.
ఈ నేపథ్యంలో జార్జ్ ఆ విషయంపై లోతుగా ఆరా తీయగా, కొందరు శత్రువులు అంజు పెళ్లి జరగకుండా అడ్డుకోవాలని, ఆమెను మళ్లీ కేసులోకి లాగి జైలుకు పంపాలని కుట్ర పన్నుతున్నారని అతనికి అర్థమవుతుంది. ఆ కుట్ర వెనుక ఉన్నవారు ఎవరు, వారికి వరుణ్ కుటుంబంతో ఉన్న సంబంధం ఏమిటి, జార్జ్ కుటుంబాన్ని దెబ్బతీయాలని చూస్తున్న పోలీసులు ఈ కుట్రను ఎలా తమ ప్రయోజనాలకు వాడుకోవాలనుకున్నారు, ఈసారి తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి జార్జ్ ఏ విధంగా ప్రతిస్పందించాడు అన్నదే ‘దృశ్యం 3’ కథలోని మిగతా ఆసక్తికర మలుపులు.
థియేటర్లలో ఇప్పటికే కథ, స్క్రీన్‌ప్లే, మోహన్‌లాల్ నటనపై చర్చలు రేకెత్తించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వేదికపై ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.







