జూన్ తొలి వారంలో రెండు కొత్త తమిళ చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. థియేటర్లలో మంచి టాక్‌తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమాలు ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలతో రూపొందిన ఈ చిత్రాలు విభిన్న కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ‘29’

తమిళంలో విడుదలైన యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ‘29’ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. స్టార్ డైరెక్టర్స్ లోకేష్ కనగరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 5 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. దర్శకుడు రత్న కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో విధు, ప్రీతి అస్రానీ, మహేంద్రన్ ప్రధాన పాత్రలు పోషించారు.

‘29’ ఏండ్ల యువకుడి ప్రేమకథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నెట్ఫ్లిఇండియాసౌత్ తమ సోషల్ మీడియా ఖాతాలో ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్, వీడియోలను షేర్ చేస్తూ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమైన విషయాన్ని ప్రకటించింది.

కథ పరంగా చూస్తే.. సత్య (విధు) చిన్నప్పటి నుంచే ముక్కుసూటి స్వభావం కలిగిన వ్యక్తి. మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకలా నటించడం అతనికి ఇష్టం ఉండదు. తనకు నచ్చినట్టుగా జీవించాలనే ఉద్దేశంతో సొంతూరు సేలం వదిలి చెన్నైకి వెళ్తాడు. అక్కడ స్నేహితులతో కలిసి ఒక గదిలో ఉంటూ ఉద్యోగం చేస్తుంటాడు. ఉద్యోగంపై పెద్దగా సంతృప్తి లేకపోయినా, జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటాడు.

ఇప్పటికే 29 ఏళ్లు వచ్చినా తనకంటూ ఓ ప్రేమకథ లేకపోవడం సత్యను బాధపెడుతుంటుంది. అలాంటి సమయంలోనే అతనికి విజయలక్ష్మి (ప్రీతి అస్రానీ) పరిచయం అవుతుంది. ఆమె తల్లి ఆశించినట్టుగా బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉంటుంది. జీవితంలో పెద్ద లక్ష్యం లేకుండా గడుపుతున్న సత్య తీరు ఆమెకు నచ్చదు. ఒకవైపు ప్రేమ పేరుతో తన వెంటపడుతున్న సత్య, మరోవైపు చదువుపైనే దృష్టి పెట్టమని చెప్తోన్న తల్లి మధ్య విజయలక్ష్మి ఏ నిర్ణయం తీసుకుంటుంది? అనేదే మిగతా కథ.

ప్రైమ్ వీడియోలో ‘కార్మేని సెల్వం’

వర్సటైల్ యాక్టర్స్ సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ డ్రామా ‘కార్మేని సెల్వం’ కూడా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. రామ్ చక్రి దర్శకత్వం వహించిన ఈ ఫీల్ గుడ్ ఫ్యామిలీ డ్రామా ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. లక్ష్మి ప్రియా, అభినయ కీలక పాత్రల్లో నటించారు.

థియేటర్లలో భావోద్వేగాలకు పెద్దపీట వేసిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, వాణిజ్య పరంగా మాత్రం సగటు ఫలితాన్నే సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం జూన్ 3 నుంచి ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతోంది. మాంగో మ్యూజిక్ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ఈ విషయాన్ని ప్రకటించింది.

కథ విషయానికి వస్తే.. చెన్నై సముద్ర తీరంలోని ఓ మురికివాడలో సెల్వమ్ (సముద్రఖని) తన భార్య శాంతి (లక్ష్మి ప్రియా), కొడుకు బాలుతో కలిసి నివసిస్తుంటాడు. ఇడ్లీ బండి నడిపే శాంతి, తమకు సొంత కారు ఉండాలని, సొంత ఇల్లు కట్టుకోవాలని కలలు కంటుంది. ఆ కలలను నిజం చేసేందుకు డబ్బు కూడబెడుతుంటుంది. అయితే కుటుంబ అవసరాలు, బాధ్యతల కారణంగా ఆ డబ్బంతా ఖర్చు అయిపోతుంది.

ఇక రిచ్‌గా బతికితేనే ధనవంతులు అవుతామనే ఆలోచన సెల్వమ్‌ను ప్రభావితం చేస్తుంది. యజమాని విదేశాలకు వెళ్లిన సమయంలో అతని కారును ట్యాక్సీగా నడుపుతూ సంపాదిస్తుంటాడు. అదే సమయంలో స్థలం కొనడం, క్రెడిట్ కార్డులతో ఖర్చులు చేయడం, అప్పులు తీసుకోవడం మొదలుపెడతాడు. భార్య హెచ్చరించినా వినకుండా అప్పుల మీద అప్పులు చేస్తూ చివరకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటాడు.

ఆ అప్పుల భారం నుంచి బయటపడటానికి సెల్వమ్ ఏం చేశాడు? అతని కుటుంబం ఎలాంటి కష్టాలను ఎదుర్కొంది? వారి కలలు చివరకు నెరవేరాయా లేదా? అనేదే సినిమా క్లైమాక్స్‌లో తెలియజేస్తారు. మధ్యతరగతి జీవితాల్లో డబ్బు ఆడించే ఆట, కలలు నెరవేర్చుకోవడం కోసం చేసే అప్పులు ఎలా తిప్పలు పెడతాయన్న విషయాలను ఈ చిత్రం ఆవిష్కరిస్తుంది.