మంత్రులు వెనకబడిపోతున్నారు.. : ఏపీ కేబినెట్‌ భేటీలో సీఎం

కేబినెట్ లో కీలక నిర్ణయాలు.. చేనేతకు రూ.25 వేల ‘నేతన్న భరోసా’

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక సూచనలు చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,120 పోస్టుల భర్తీకి సంబంధించి కేబినెట్ ఆమోదం కోసం వచ్చిన ప్రతిపాదనను మరోసారి అధ్యయనం చేయాలని ఆదేశించారు. అవసరమైన ఉద్యోగాలు కోసం మరోసారి అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని కోరారు. మంత్రులు తమ శాఖల పనితీరుపై మరింత దృష్టి సారించాలని సీఎం సూచించారు. చాలా అంశాల్లో మంత్రులు వెనుకబడిపోతున్నారని సీఎం అన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిన తర్వాత, ఆ అంశంపై ఎమ్మెల్యేలు, మంత్రులు బాధ్యత తీసుకుని ప్రజలకు వివరించాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, కలెక్టర్ కలిసి పనిచేస్తే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, ఇద్దరూ కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించాలని సూచించారు.

రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి(SIPB)లో ఆమోదం పొందిన ప్రాజెక్టులను జిల్లా స్థాయిలో సమీక్షించాలని సీఎం ఆదేశించారు. అలాగే ప్లానింగ్ బోర్డు సమావేశాలను తరచూ నిర్వహిస్తూ, అభివృద్ధి పనులపై క్రమం తప్పకుండా సమీక్షలు చేయాలని సూచించారు. ‘మీ శాఖల్లో ఉన్న సమస్యలను మీరే పరిష్కరించే విధంగా చొరవ చూపాలి. రెండేళ్ల ప్రభుత్వ విజయాలపై మంత్రులు మీడియా సమావేశాలు నిర్వహించినప్పటికీ, వాటిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లలేకపోయారు’ అని చెప్పుకొచ్చారు.

పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడికి సంబంధించిన ఘటన, తిరుపతిలో ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసుల్లో సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందితులు దొరికిపోయారని ముఖ్యమంత్రి చెప్పారు. డీఎస్సీ పరీక్షల అంశంలో ప్రతిపక్షం చేసిన ఆరోపణలను ప్రజలు నమ్మలేదని, కోర్టులోనూ వారికి అనుకూల ఫలితం రాలేదని వ్యాఖ్యానించారు. ఈ అంశాన్ని ఢిల్లీలో జరిగిన నీట్ ఉద్యమంతో ముడిపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇలాంటి అంశాల్లో మంత్రులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. గోదావరి పుష్కరాలు, పోలవరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒకే రోజు నిర్వహించే అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. పోలవరం ప్రారంభోత్సవం, గోదావరి పుష్కరాల ప్రారంభ కార్యక్రమాలను విడివిడిగా నిర్వహిస్తే బాగుంటుందని మంత్రి నిమ్మల రామానాయుడు సమావేశంలో చెప్పినట్లు సమాచారం.

పలు కీలక నిర్ణయాలు..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సుమారు మూడు గంటలపాటు సమావేశం కొనసాగింది. భోగాపురం విమానాశ్రయం పనుల పురోగతిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. అలాగే రెండో దశలో 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అంశంపై మరింత అధ్యయనం చేయాలని నిర్ణయించారు. ఈ అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించి, తదుపరి కేబినెట్ సమావేశంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. చేనేత కార్మికులకు ‘నేతన్న భరోసా’ కింద రూ.25 వేలు చొప్పున ఆర్థికసాయం అందించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి బీపీఎల్ నేతలకు సంవత్సరానికి రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించారు.

పుష్కరాల నిర్వహణకు రూ.50 కోట్లు..

వెదుళ్లపల్లిలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయడానికి ఏపీ కేబినెట్ నుంచి ఆమోదం లభించింది. అలాగే శ్రీకాకుళంలోని బ్రహ్మకుమారీస్ సంస్థకు మున్సిపల్ స్థల లీజును కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పుష్కరాల నిర్వహణ, భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్ల నిధుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడం వంటి అంశాలకు మంత్రివర్గం నుంచి ఆమోదం లభించింది. విష్ణు ఉమెన్స్ యూనివర్సిటీ, చలపతి యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీల జాబితాలో చేర్చే ఆర్డినెన్స్‌పై కూడా మంత్రివర్గం చర్చించింది. అలాగే నేరడి బ్యారేజ్ నిర్మాణానికి రూ.641.10 కోట్ల పరిపాలనా అనుమతుల మంజూరుపై చర్చ జరిగింది. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్-2 పనుల అంచనా వ్యయాన్ని రూ.241.20 కోట్ల నుంచి రూ.312 కోట్లకు పెంచేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఎల్‌నినోపై చర్చ..

కేబినెట్ సమావేశంలో ఎల్‌నినోను ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఎలినోవా పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించాలని చెప్పారు. తాగునీటి సరఫరా, పశువులకు మేతపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రులు, అధికారులకు సూచించారు. మెగా డీఎస్సీ అంశాన్ని ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలతో ముడిపెట్టి వైసీపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. లేని వివాదాలను సృష్టించే ప్రయత్నాలు జరుగుతాయని, అలాంటి చర్యలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

మంత్రులు ప్రో-యాక్టివ్‌గా ఉండాలి...

పొగాకు ధరల అంశాన్ని సమావేశంలో మంత్రులు ప్రస్తావించారు. ఈ అంశాన్ని వివాదాస్పదం చేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని మంత్రులు చెప్పగా.. వాళ్లకు ఎందుకు అవకాశం ఇవ్వాలని సీఎం ప్రశ్నించారు. ప్రభుత్వం పొగాకు రైతుల కోసం తీసుకున్న చర్యలను ప్రజలకు ముందుగానే వివరించాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజలకు ముందే తెలియజేస్తే ప్రతిపక్షానికి అవకాశం ఉండదని, ప్రో-యాక్టివ్‌గా మంత్రులు ముందుకెళ్లాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.