చిలకలూరిపేట నియోజకవర్గంలో జూన్ 15 నుంచి ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రెవిసిన్ (SIR) ప్రక్రియకు సంబంధించి బూత్ కమిటీ సభ్యులు, బూత్ లెవల్ ఏజెంట్లు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ పార్టీ ఇంచార్జ్ శ్రీమతి విడదల రజిని సూచించారు. ఈ మేరకు చిలకలూరిపేట పట్టణ, రూరల్ మండలాలకు చెందిన పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు)తో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రజిని మాట్లాడుతూ SIR ప్రక్రియలో బీఎల్ఏలు కీలక పాత్ర పోషిస్తారని వివరించారు. బూత్ లెవల్ అధికారులైన బీఎల్వోలు, బీఎల్ఏల మధ్య సమన్వయం సమర్థవంతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బీఎల్ఏలకు అవసరమైన శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రక్రియను సజావుగా కొనసాగించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

వైయస్ఆర్ సీపీ సానుభూతిపరుల ఓట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ తొలగించబడకుండా అప్రమత్తంగా ఉండాలని పార్టీ నాయకులకు రజిని సూచించారు. డ్రాఫ్ట్ దశలోనే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావని ఆమె పేర్కొన్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందుబాటులోకి వచ్చేలోపే బీఎల్ఏలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని, ఓటర్లకు సంబంధించిన అవసరమైన ఆధార పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రస్తుతం జరుగుతున్నది స్పెషల్ ఇంటెన్సివ్ రెవిసిఒన్ ప్రక్రియ కావడంతో ఒకసారి ఓటు తొలగించబడితే తిరిగి చేర్చుకోవడం కష్టసాధ్యమవుతుందని రజిని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించినప్పుడే ఓటు హక్కు కొనసాగుతుందనే విషయాన్ని ప్రతి ఓటరుకు వివరించాలని బీఎల్ఏలు, బూత్ కమిటీ సభ్యులకు ఆమె సూచించారు.

సెప్టెంబర్ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో పనిచేసే అన్ని బృందాలు పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు రజిని పిలుపునిచ్చారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న దొంగ ఓట్లను గుర్తించి వెంటనే బీఎల్వోలకు ఫిర్యాదులు చేయాలని, మరోవైపు పార్టీ మద్దతుదారుల ఓట్లు తొలగించబడకుండా కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆమె సూచించారు.

SIR ప్రక్రియ పూర్తయ్యే వరకు బూత్ కమిటీ సభ్యులు, బీఎల్ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి ఓటును పరిరక్షించాలని రజిని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా బాధ్యతతో వ్యవహరిస్తే నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సక్రమంగా ఉండేలా చూడవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.