జనసేన సాధక్ సమ్మేళనంకు నిరాకరణ

హైకోర్టులోనూ పవనకు చుక్కెదురు

హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు

హైదహారాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2000 వేల మంది జనసేన సాధక్ లతో నిర్వహించ తలచిన 'తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ - జనసేన సాధక్ సమ్మేళనం' సభకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. దీనిపై ఆ పార్టీకి హైకోర్టు లోనూ చుక్కెదురైంది. పార్టీ దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను కూడా హైకోర్టు తిరస్కరించింది. పార్టీ తరఫున అత్యవసర విచారణ కోరుతూ హౌస్‌మోషన్‌ పిటిషన్‌ను మంగళవారం హైకోర్టులో దాఖలు చేయగా, ప్రాథమిక పరిశీలన అనంతరం కోర్టు దాన్ని స్వీకరించేందుకు నిరాకరించినట్లు న్యాయవర్గాలు తెలిపాయి.

జనసేన దాఖలు చేసిన ఈ హౌస్‌మోషన్‌ పిటిషన్‌లో ఏ అంశంపై అత్యవసర విచారణ కోరారన్న వివరాలు అధికారికంగా వెలుబడలేదు. అయితే, పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలు హౌస్‌మోషన్‌ పరిధిలోకి రావని, అత్యవసర విచారణ అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడినట్లు సమాచారం. దీంతో పిటిషన్‌ను నమోదు చేయకుండా తిరస్కరించినట్లు సమాచారం.

హౌస్‌మోషన్‌ పిటిషన్‌ అనేది అత్యవసర పరిస్థితుల్లో, తక్షణ న్యాయసహాయం అవసరమని భావించినప్పుడు కోర్టు ముందు పెట్టే ప్రత్యేక వినతిగా న్యాయ నిపుణులు వివరిస్తున్నారు. సాధారణంగా ప్రజా ప్రయోజనం, రాజ్యాంగ హక్కులు, తక్షణ జోక్యం అవసరమైన పరిపాలనా నిర్ణయాలపై ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తారు. అయితే, ప్రతి హౌస్‌మోషన్‌ను కోర్టు తప్పనిసరిగా స్వీకరించాల్సిన అవసరం ఉండదని, కోర్టు విచక్షణాధికారంతోనే స్వీకరణపై నిర్ణయం తీసుకుంటుందని న్యాయవాదులు చెబుతున్నారు.

జనసేన తరఫున హౌస్‌మోషన్‌ పిటిషన్‌ తిరస్కరణపై పార్టీ వర్గాలు అంతర్గతంగా సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. తదుపరి న్యాయపరమైన చర్యలపై కూడా చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. అవసరమైతే సాధారణ పిటిషన్‌ రూపంలో లేదా ఇతర న్యాయ మార్గాల ద్వారా అంశాన్ని మళ్లీ కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.