రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ఏడాదికి రూ.25 వేల చొప్పున అందజేత: మంత్రి సవిత
రాష్ట్రంలో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసానిచ్చే ‘నేతన్నకు భరోసా’ పథకాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించారు. ఈ పథకం కింద ఏడాదికి రూ.25వేల చొప్పున అందిస్తామన్నారు. ఇందుకు మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని వివరించారు. వారి ఆరోగ్య భద్రతకు యూనివర్సల్ హెల్త్పాలసీని అమలు చేయనున్నట్లు వివరించారు. రాజధాని అమరావతిలో నిఫ్ట్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్రమంత్రి సూత్రప్రాయంగా అంగీకరించారని, త్వరలో తీపికబురు అందనుందని వెల్లడించారు. అమరావతిలోనే చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు కేంద్రానికి నివేదించామన్నారు. చేనేత, జౌళి శాఖలో రెండేళ్ల ప్రగతిపై మంత్రి సవిత సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేశ్, సీఎం సతీమణి భువనేశ్వరి చేనేత వస్త్రాలను బాగా ప్రమోట్ చేస్తున్నారు. చేనేతలకు అండగా నిలిచేలా ప్రతి ఒక్కరూ వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలి. కూటమి ఆధికారంలోకి వచ్చాక నేత కార్మికుల ఉపాధి మెరుగయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాం’ అన్నారు.
విశాఖలో రూ.4వేల కోట్లతో వస్త్రతయారీ పరిశ్రమ
ఫిన్లాండ్కు చెందిన ఇన్ఫినెట్ ఫైబర్ కంపెనీ విశాఖలో రూ.4వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఇప్పటికే స్థలాన్ని కేటాయించాం. ఈ కంపెనీ టెక్స్టైల్ పరిశ్రమల్లోని వ్యర్థాల నుంచి వస్త్రాలు తయారుచేయనుంది. మరో నాలుగు కంపెనీలతోనూ ఒప్పందాలు జరిగాయి. వాటికీ భూ కేటాయింపులు జరుగుతున్నాయి.
చేనేత, హస్తకళాకారులకు 365 రోజులూ ఉపాధి ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే ధర్మవరంలో రూ.38 కోట్లతో మెగా చేనేత క్లస్టర్‌ను కేంద్రం మంజూరు చేసింది. త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం. 10వేల మందికి లబ్ధి చేకూరనుంది. మంగళగిరిలో రూ.22 కోట్లతో చేనేత క్లస్టర్, పిఠాపురంలో రూ.15 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. ఇవి కాకుండా 10 చిన్న తరహా క్లస్టర్లు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 90% రాయితీతో ఆధునిక మగ్గాలను అందించబోతున్నాం. చేనేత వస్త్రాలు, హస్తకళా రూపాలు ఒకేచోట విక్రయించేలా షోరూంలను ఏర్పాటు చేయబోతున్నాం.
శాలువా, పంచె, తదితర 8 రకాల చేనేత వస్త్రాల్ని తితిదేకి సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నాం. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో కొత్తగా లేపాక్షి ఔట్లెట్ ఏర్పాటుచేస్తాం. విదేశాలకూ వీటిని విస్తరించనున్నాం. విదేశాలకు చేనేత, హస్తకళా రూపాల ఎగుమతిని మూడు రెట్లు పెంచబోతున్నాం. విశాఖలో రూ.172 కోట్లతో యూనిటీ మాల్‌ను ఏర్పాటుచేస్తున్నాం. వైకాపా ప్రభుత్వం నిలిపేసిన త్రిఫ్ట్ ఫండ్ పథకాన్ని, నూలు రాయితీ పథకాన్ని పునరుద్ధరించాం. ఈ రెండు పథకాల కింద గత రెండేళ్లలో రూ.260 కోట్లు ఖర్చుచేశాం. చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నాం. పాత ఆప్కో షోరూంలను రినోవేషన్ చేయడంతో పాటు కొత్తగా ఐదింటిని ఏర్పాటుచేశాం. ఖాదీ బోర్డు ద్వారా 2024-25లో 974 ప్రాజెక్టులు తీసుకొచ్చి రూ.40 కోట్లు రాయితీగా అందించాం. 11 వేల మందికి ఉపాధి కల్పించాం. 2025-26 ఏడాదిలో 2319 ప్రాజెక్టులకు రూ.70 కోట్లు రాయితీగా ఇచ్చాం. 25 వేల మందికి ఉపాధి లభించనుంద ని మంత్రి సవిత తెలిపారు.







