దమ్ముంటే జైలుకు పంపు..

మంత్రి కొల్లు రవీంద్రకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్‌

విజయవాడ: మంత్రి కొల్లు రవీంద్ర తాను బియ్యం దొంగతనం చేశానని ఆరోపణలు చేస్తున్నారని, నిజంగా దమ్ముంటే అధికారాలు వినియోగించి తనపై విచారణ జరిపి జైలుకు పంపాలని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పేర్ని నాని సవాల్‌ విసిరారు. 2029 నాటికి చంద్రబాబు సర్కార్‌ పతనం ఖాయమని వ్యాఖ్యానిస్తూ, ఆ లోపు తనను లోపల పెట్టే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గంలో ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియపై గురువారం నిర్వహించిన అవగాహన, శిక్షణా కార్యక్రమంలో పేర్ని నాని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మచిలీపట్నం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి పేర్న కిట్టు, వరికూటి అశోక్ బాబు, బూత్ లెవెల్ ఏజెంట్లు, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి బూత్ కమిటీ అధ్యక్షులు, సభ్యులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ చంద్రబాబు, హోంమంత్రి అనితపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్పోర్ట్స్‌ కోటాను మూడు శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పుడు బాధ్యతగలవారికి అవగాహన లేదా అని ప్రశ్నించారు. స్పోర్ట్స్‌ కోటాలో 382 మందిని నియమించుకున్నామని ఇప్పుడు చెబుతున్నారని, నిన్నటి వరకూ మూడు శాతం కోటా అంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు సంఖ్యలు మాత్రమే చెబుతోందని విమర్శించారు. ఎంతమందిని స్పోర్ట్స్‌ కోటాలో నియమించుకున్నారో స్పష్టంగా చెప్పలేకపోతున్నారని, జీవోలో మార్పులు చేసి 29 ఆటలను 67 ఆటలకు పెంచిన విషయాన్ని ఆయన ఎత్తిచూపారు. 40వ ఆటగా పేక ముక్కలతో ఆడే బ్రిడ్జ్‌ ఆటను చేర్చారని, ఏ ఆటకు ఎవరిని తీసుకున్నారో తొమ్మిది నెలలుగా వెల్లడించలేదని ఆయన ఆరోపించారు.

తాము నిరసనలు చేపట్టడంతోనే ఇప్పుడు డేటాను బయటకు పెడుతున్నారని పేర్ని నాని వ్యాఖ్యానించారు. పేకాట ఆడేవారిని తీసుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నప్పటికీ, ఐఏఎస్‌ అధికారి సంతకం లేకుండా స్పోర్ట్స్‌ కోటా జాబితా ఎలా విడుదల చేశారని ప్రశ్నించారు. ప్రజల అదృష్టం బాగుండి పేకాట నుంచి టీచర్లను తీసుకోలేదని, లేకపోతే బ్యాగులు, సర్టిఫికెట్లు తెచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆటల జాబితాను కేంద్రం నిర్ణయించిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, డీఎస్సీ నియామకాలలో అక్రమాలు బహిర్గతమైన తర్వాతే చంద్రబాబు, అనిత మాట్లాడుతున్నారని పేర్ని నాని విమర్శించారు. డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి లోకేష్‌ నోరు విప్పడం లేదని, లోకేష్‌ ఏజెంట్ల తరఫున సీఎం, హోంమంత్రి మాత్రమే మాట్లాడేందుకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

ఆడపిల్లలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నప్పుడు హోంమంత్రి స్పందించరని, అయితే విద్యాశాఖలో తప్పులు జరిగాయని తాము ప్రశ్నించగానే హోంమంత్రి తెరమీదకు వచ్చారని పేర్ని నాని మండిపడ్డారు. డీఎస్సీలో చేసిన పాపాలు తమను వదిలిపెట్టవని, చంద్రబాబు గొప్పలు రాష్ట్రానికి అప్పుల రూపంలో మాత్రమే మిగిలాయని ఆయన విమర్శించారు.