డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. శనివారం ఏలూరులో పర్యటించి, పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్‌ను మంత్రి పరిశీలించారు.

ఈ క్యాంటీన్‌లో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహన్, కలెక్టర్ వెట్రి సెల్వి అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడారు. ఏపీలో 8 ప్రాంతాల్లో తృప్తి క్యాంటీన్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరో ఎనిమిది తృప్తి క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏలూరులో మరో తృప్తి క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.