రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
బీసీల హామీల అమలులో కూటమి నిర్లక్ష్యం
వైయస్సార్ కాంగ్రెస్ బీసీ సెల్ సమీక్ష
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు.
రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై త్వరలోనే విజయవాడలో భారీ సమావేశం నిర్వహించి, బీసీల సమస్యలపై పోరాటం చేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేస్తుందని ఆయన పేర్కొన్నారు. బీసీల హక్కుల పరిరక్షణ, వారికి ఇచ్చిన హామీల అమలు, ప్రస్తుతం జరుగుతున్న దాడులపై వ్యూహాత్మకంగా పోరాటం కొనసాగించే అంశాలపై ఈ సమీక్ష సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలకు అన్ని విధాలుగా సహకారం అందించిన నాయకుడు జగన్ అని రమేష్ యాదవ్ అభిప్రాయపడ్డారు. రాజకీయంగా బీసీలకు ఎన్నో ఉన్నత పదవులు కల్పించి, వారిని ప్రోత్సహించిన విధానాన్ని ఆయన కొనియాడారు. బీసీ వర్గాల అభివృద్ధి, సాధికారత కోసం గతంలో చేపట్టిన చర్యలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, పిల్లి సుభాష్ చంద్రబోస్, విడుదల రజిని, వేణుగోపాల్, జోగి రమేష్, బూడి ముత్యాల నాయుడు, మాజీ ఎంపీలు మార్గాని భరత్, తలారి రంగయ్య తదితర నాయకులు హాజరయ్యారు.
సమావేశంలో పాల్గొన్న నేతలు బీసీల సమస్యలు, ప్రస్తుతం బీసీ వర్గాలపై జరుగుతున్న దాడులు, అన్యాయాలపై విశదంగా చర్చించినట్లు రమేష్ యాదవ్ తెలిపారు. బీసీలపై జరుగుతున్న వివక్ష, రాజకీయంగా వారిని పక్కన పెట్టే ప్రయత్నాలపై పార్టీగా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజా ఉద్యమాల రూపకల్పన, బీసీ వర్గాల ఐక్యత, చైతన్యంపై సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని ఆయన వివరించారు.
విజయవాడలో జరగబోయే భారీ సమావేశానికి బీసీ వర్గాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా హాజరై, తమ సమస్యలను బహిరంగంగా వినిపించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు బీసీ సెల్ నేతలు సమావేశంలో పేర్కొన్నారు. బీసీల హక్కుల కోసం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరంతర పోరాటం కొనసాగిస్తుందని నాయకులు సమావేశంలో స్పష్టం చేసినట్లు సమాచారం.







