రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్‌ఆర్‌సీపీ నిరసనల హోరు

తాడేపల్లి: “చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైయ‌స్‌ఆర్‌సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా సాగాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలన్నింటిలో ఆ పార్టీ శ్రేణులు భారీ ర్యాలీలు, ఆందోళనలు నిర్వహిస్తూ ప్రభుత్వ విధానాలపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. పలుచోట్ల పోలీసుల ఆంక్షలు, అడ్డంకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డెక్కారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువత, డీఎస్సీ బాధితులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ వైఖరిపై తమ అసంతృప్తిని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ర్యాలీల్లో ఇంధన ధరల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరల భారం, డీఎస్సీ–2025లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలు, నిరుద్యోగ సమస్యలు తదితర అంశాలను ప్రస్తావిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ నిరసనకారులు నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. మహిళలు, రైతులు, విద్యార్థులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశకు గురయ్యారని వారు పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ నిరసన కార్యక్రమాలు ప్రజల నుంచి విశేష స్పందన పొందాయని వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై జనాగ్రహం కట్టలు తెంచుకుంటోందని వారు అభిప్రాయపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటాన్ని మరింత ఉధృతంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.