‘చైనా పీస్‌’ పేరుతో ప‌ట్టాలెక్కి, ఆ త‌ర్వాత పేరు మార్చుకున్న స్పై డ్రామా చిత్రం ‘సీక్రెట్ సోల్జర్‌’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్ర‌చార చిత్రాలు, ఈ సినిమా జానర్‌ రెండూ కలసి ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించాయి. సాధారణంగా స్పై సినిమాలు అంటే భారీ తారాగణం, సాంకేతిక హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అలాంటి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందన్నది ఆసక్తికరంగా మారింది.

కథలోకి వెళితే... మీరా వలి (నిహాల్ కోదాటి), పృథ్వీ (సూర్య శ్రీనివాస్‌) నెల్లూరు యువకులు. ఇద్దరూ మంచి స్నేహితులు. మీరా వలికి దేశభక్తి ఎక్కువ. ఎప్పటికైనా సైన్యంలో చేరి తన దేశభక్తిని నిరూపించుకోవాలన్నది అతని కల. అందుకోసం పలు ప్రయత్నాలు చేస్తుంటాడు. పృథ్వీ కూడా తన వంతుగా అతనికి ప్రోత్సాహం అందిస్తుంటాడు. అయితే ఆ కల సులభంగా నెరవేరదు. ఇదే సమయంలో ఊహించని రీతిలో మీరా వలికి దేశభక్తిని నిరూపించుకునే అవకాశం వస్తుంది. దాని కోసం అతను గూఢచారిగా మారి ఓ కీలకమైన మిషన్‌లో భాగమవుతాడు.

ఆ మిషన్‌ ఎందుకోసం? గూఢచారిగా మారిన మీరా వలి గురించి పృథ్వీకి ఎప్పుడు, ఎలా తెలిసింది? దేశం కోసం వలి ఏం చేశాడు? వలికి సంబంధించిన విషయాలన్నీ తెలిసిన పృథ్వీని వెంటాడిన శత్రువులు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై ఒక్కొక్కటిగా బయటపడతాయి.

స్నేహం, దేశభక్తి మేళవింపుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. సున్నితమైన అంశాలతో కూడిన ఓ కీలకమైన మిషన్‌కీ, నెల్లూరుకు చెందిన ఇద్దరు కుర్రాళ్లకీ మధ్య ఉన్న సంబంధమే కథలో ప్రధానాంశం. సాధారణంగా స్పై డ్రామాల్లో కనిపించే హంగులకు భిన్నంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రథమార్ధం దాదాపుగా ఇద్దరు స్నేహితుల ప్రయాణంలా సాగుతుంది. భిన్న ఆలోచనలు, నేపథ్యాలున్న ఇద్దరు యువకుల మధ్య స్నేహం, అక్కడక్కడా పండిన సహజమైన హాస్యం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

ద్వితీయార్ధంలో గూఢచర్యం నేపథ్యం, కథలోని మలుపులు ఆసక్తిని రేకెత్తిస్తాయి. సైన్యంలో చేరాలనుకున్న మీరా వలి చేసే ప్రయత్నాలు, అతని కుటుంబం నేపథ్యంలోని సన్నివేశాల ద్వారా అసలు కథలోకి వెళ్లడానికి కొంత సమయం తీసుకుంటుంది. విరామానికి ముందు వచ్చే కీలకమైన మలుపు సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మిషన్‌లో స్నేహితులిద్దరూ భాగమయ్యే తీరు, వాళ్లు చేసే సాహసాలు, ఎవ్వరూ ఊహించని శత్రువులు వెలుగులోకి వచ్చే విధానం ద్వితీయార్ధానికి ప్రధాన ఆకర్షణ.

అయితే గూఢచర్యం చేసే కథానాయకుడు శత్రువుల చేతుల్లో ఎప్పుడూ ఓ పావులా కనిపిస్తుంటాడు. అతనికి సొంతంగా చూపించే తెగువ, చేసిన సాహసాలు పెద్దగా కనిపించవు. దేశానికి సంబంధించిన సున్నితమైన అంశాలు, వాటి భద్రతతో ముడిపడిన విషయాల్ని చూపించిన తీరు కూడా కొంత సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పేరుకే స్పై డ్రామా కానీ, ఆ గాఢత, సీరియస్‌నెస్‌ సన్నివేశాల్లో పూర్తిగా కనిపించదు. అయితే గూఢచారుల జీవితాలు ఎలా ముగిసిపోతుంటాయి, వాళ్లకు దక్కే గుర్తింపు ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పిన తీరు మాత్రం బాగుంది.

నటీనటుల విషయానికి వస్తే... డబ్బున్న కుర్రాడిగా సూర్య శ్రీనివాస్‌, దేశభక్తి మెండుగా ఉన్న యువకుడిగా నిహాల్ కోదాటి తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ రెండు పాత్రల మధ్య స్నేహం సినిమాకి ప్రధాన బలం. నెల్లూరు యాసలో మాట్లాడుతూ, అక్కడక్కడా నవ్విస్తూ సాగే పాత్రతో సూర్య శ్రీనివాస్ వైవిధ్యాన్ని చూపించాడు. హర్షిత బండ్లమూరి, శిరీష నూలు పాత్రలు కథలో కీలకంగా నిలిచాయి.

రఘుబాబు, తులసి, వడ్లమాని శ్రీనివాస్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, కమల్ కామరాజు, రంగస్థలం మహేశ్ తదితరులు ఈ చిత్రంలో కనిపించినా, దర్శకుడు వారిని సమర్థంగా ఉపయోగించుకోలేకపోయినట్టు అనిపిస్తుంది. దాదాపుగా అందరూ చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. మహిళా పాత్రలు మాత్రం ఆకట్టుకుంటాయి. సంగీతం, కెమెరా విభాగాలు మంచి పనితీరును కనబరిచాయి. సినిమా నిడివి తక్కువే అయినా, కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపించే చోటులు ఉన్నాయి.

దర్శకుడు అక్కి విశ్వనాథ్‌రెడ్డి అరుదైన నేపథ్యాన్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. అయితే కథను మరింత బలంగా, నమ్మదగ్గ విధంగా చెప్పడంలో అక్కడక్కడా తడబడ్డారు. మాటలు బాగున్నాయి. మూన్ లైట్ డ్రీమ్స్ ప్రై.లి. నిర్మాణం పర్వాలేదనిపిస్తుంది.

మొత్తం మీద ‘సీక్రెట్ సోల్జర్‌’ స్పై డ్రామాగా పెద్దగా ప్రభావం చూపకపోయినా, స్నేహం–దేశభక్తి మేళవింపుతో పర్వాలేదనిపించే చిత్రంగా నిలిచింది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

రేటింగ్:- 2.5/5