రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: భారత్‌లో లాంగ్‌జంప్ అంటే గుర్తొచ్చే పేరు అంజు జార్జి. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ, అంతర్జాతీయ వేదికపై తన ముద్ర వేసుకుంటోంది 25 ఏళ్ల అన్సీ సోజన్. కేరళలోని నట్టికా గ్రామానికి చెందిన ఈ అథ్లెట్ మొదట లాంగ్‌జంప్ క్రీడాకారిణి కాదు. స్ప్రింట్ ఈవెంట్లతో తన క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె, తరువాత లాంగ్‌జంప్ వైపు మళ్లింది.
అన్సీ తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. చిన్నప్పటి నుంచే తమ గ్రామంలోని బీచ్ దగ్గరకు అన్సీని తీసుకెళ్లేవాడు. అక్కడ ఇసుకపై పరుగెత్తడం, ఎగరడం ఆమెకు అలవాటైంది. అదే అలవాటు ఆమెను అథ్లెట్‌గా తీర్చిదిద్దిందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. మొదట స్ప్రింటర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అన్సీ, క్రీడా కోటాలో భారత నావికా దళంలో ఉద్యోగం పొందింది. ఆ తరువాత ఆమె పూర్తిగా లాంగ్‌జంప్‌పై దృష్టి సారించింది.
స్ప్రింట్‌లో ఉన్న వేగాన్ని లాంగ్‌జంప్‌లోనూ వినియోగిస్తూ అన్సీ తన ప్రతిభను చాటుతోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఆమె ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. 2022లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొన్న అన్సీ, అప్పుడు పతకం సాధించలేకపోయింది. అయితే ఆ వైఫల్యంతో ఆమె వెనక్కి తగ్గలేదు.
అదే ఏడాది ఆసియా క్రీడల్లో రజత పతకంతో మెరిసిన అన్సీ, తరువాతి టోర్నీల్లోనూ తన ఫామ్‌ను కొనసాగించింది. గత సంవత్సరం ఆసియా ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్న ఆమె, ఈ సీజన్‌లో జరిగిన ఆసియా ఇండోర్ పోటీల్లో కూడా మరో రజత పతకాన్ని ఖాతాలో వేసుకుంది.
ఈ ఏడాది భువనేశ్వర్‌లో జరిగిన అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అన్సీ తన కెరీర్‌లో కీలక ఘట్టాన్ని నమోదు చేసింది. 6.88 మీటర్ల జంప్‌తో 22 ఏళ్లుగా నిలిచిన అంజు జార్జి 6.83 మీటర్ల జాతీయ రికార్డును ఆమె అధిగమించింది. ఈ ప్రదర్శనతో ఆమెపై దేశవ్యాప్తంగా అంచనాలు మరింత పెరిగాయి.
అదే ఫామ్‌ను కొనసాగిస్తూ జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లోనూ అన్సీ రజత పతకంతో అదరగొట్టింది. ఫైనల్లో త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయినా, ఆమె పోరాట స్పూర్తి ప్రశంసలు అందుకుంది.
‘‘కొద్ది తేడాతో స్వర్ణాన్ని గెలవలేకపోవడం చాలా బాధగా ఉంది. దాదాపు చివరిదాకా పసిడికి పోటీలో ఉన్నా. ఈరోజు నాది కాదు. కానీ రెండోసారి ఆసియా క్రీడల్లో పతకం గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడితో ముగియలేదు. ఈసారి మరింత బలంగా తిరిగొస్తా’’ అని అన్సీ చెప్పింది.







