ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో అత్యంత విజయవంతమైన జట్టు బ్రెజిల్‌కు జపాన్‌ గట్టి పోరాటం ఇచ్చింది. మొదట గోల్‌ చేసి ఆధిక్యంలోకి దూసుకెళ్లిన జపాన్‌ జట్టు, మ్యాచ్‌ ముగింపు వరకు బ్రెజిల్‌ను బాగా అడ్డుకుంది. అదనపు సమయానికి మ్యాచ్‌ దారితీయడం ఖాయమనే పరిస్థితిలో చివరి క్షణాల్లో మార్టినెలి గోల్‌ బ్రెజిల్‌కు విజయాన్ని అందించింది. ఈ ఫలితంతో మాజీ ఛాంపియన్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టింది.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన బ్రెజిల్‌ ఫిఫా ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం హ్యూస్టన్‌లో జరిగిన నాకౌట్‌ (32 జట్ల రౌండ్‌) మ్యాచ్‌లో బ్రెజిల్‌ 2-1తో జపాన్‌పై విజయం సాధించింది. బ్రెజిల్‌ తరఫున కాసెమిరో (56వ నిమిషం), మార్టినెలి (90+5వ నిమిషం) గోల్స్‌ నమోదు చేయగా, జపాన్‌ తరఫున సానో (29వ నిమిషం) ఏకైక గోల్‌ సాధించాడు.

మ్యాచ్‌ ఆరంభం నుంచి బ్రెజిల్‌ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంతిని ఎక్కువసేపు తన నియంత్రణలో ఉంచుకుని పదేపదే దాడులు చేసింది. ప్రత్యర్థి రక్షణశ్రేణిని ఒత్తిడికి గురి చేసింది. ప్రారంభ దశలోనే జపాన్‌ తన అర్ధభాగాన్ని దాటడానికే ఇబ్బంది పడింది. 14వ నిమిషంలో కున్యా చేసిన షాట్‌ను జపాన్‌ గోల్‌కీపర్‌ సుజుకి అడ్డుకున్నాడు.

రెండు నిమిషాలకే ప్రమాదకర ప్రాంతంలో జపాన్‌ ఫ్రీకిక్‌ సాధించింది. బాక్స్‌కు కాస్త బయట నుంచి కమడా చేసిన షాట్‌ ఫలించలేదు. అయితే కొద్దిసేపటికే జపాన్‌ బ్రెజిల్‌కు షాక్‌ ఇచ్చింది. మిడ్‌ఫీల్డ్‌లో డానిలో నుంచి బంతిని లాక్కున్న సానో, కాసెమిరోను దాటుకుంటూ బాక్స్‌ వెలుపలి నుంచి నెట్‌ ఎడమవైపునకు బలంగా తన్నడంతో జపాన్‌ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. విరామానికి ముందు బ్రెజిల్‌ స్కోరు సమం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. కున్యా దూరం నుంచి చేసిన మరో షాట్‌ను కూడా సుజుకి సులభంగా అడ్డుకున్నాడు.

తొలి అర్ధభాగంలో బ్రెజిల్‌ బంతిని సుమారు 60 శాతం తన ఆధీనంలో ఉంచుకుని, మూడు సార్లు టార్గెట్‌పై దాడి చేసినా గోల్‌ సాధించలేకపోయింది. ద్వితీయార్ధాన్ని బ్రెజిల్‌ మరింత దూకుడుగా ప్రారంభించింది. వరుస దాడులతో జపాన్‌ రక్షణశ్రేణిని ఒత్తిడిలోకి నెట్టింది. 52వ నిమిషంలో గిమరేస్‌ చేసిన బలమైన హెడర్‌ను సుజుకి అద్భుతంగా అడ్డుకున్నాడు.

అయితే బ్రెజిల్‌ ప్రయత్నం ఆలస్యంగా ఫలించింది. 56వ నిమిషంలో కాసెమిరో గోల్‌తో స్కోరు 1-1గా సమమైంది. గాబ్రియెల్‌ నుంచి వచ్చిన క్రాస్‌ను కాసెమిరో తలతో నెట్‌లోకి పంపించాడు. అదే ఉత్సాహంతో బ్రెజిల్‌ దాడులు కొనసాగించింది. 59వ నిమిషంలో విన్సియస్‌ చేసిన షాట్‌ పోస్ట్‌ను తాకి బయటకు రావడంతో బ్రెజిల్‌కు గోల్‌ తృటిలో చేజారింది.

మ్యాచ్‌ స్టాపేజ్‌ టైమ్‌లోకి వెళ్లడంతో అదనపు సమయం తప్పదని అందరూ భావించిన వేళ, 90+5వ నిమిషంలో గిమరేస్‌ నుంచి వచ్చిన పాస్‌ను అందుకున్న మార్టినెలి, జపాన్‌ గోల్‌కీపర్‌ను మోసం చేస్తూ బంతిని నెట్‌లోకి పంపించాడు. ఈ గోల్‌తో బ్రెజిల్‌ 2-1తో ముందంజ వేసి విజయాన్ని సొంతం చేసుకుంది. సాంబా జట్టు ఆటగాళ్లు, అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.