రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ఫిఫా ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన బ్రెజిల్‌ను ఆఫ్రికా సంచలనం మొరాకో నిలువరించింది. గత ఫిఫా ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ దాకా దూసుకెళ్లిన మొరాకో, ఈసారి కూడా తన జోరు కొనసాగిస్తూ సాకర్ దిగ్గజం బ్రెజిల్‌ను ఆపేసింది. గ్రూప్-సిలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లు చెరో గోల్‌కే పరిమితమయ్యాయి. దీంతో పోరు 1-1తో డ్రాగా ముగిసింది.
మ్యాచ్ ప్రారంభమైన 21వ నిమిషానికే మొరాకో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ జట్టు ఆటగాడు ఇస్మాయిల్ సైబారి గోల్ చేసి మొరాకో అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. అయితే ఎక్కువసేపు వెనుకబడి ఉండని బ్రెజిల్ 32వ నిమిషంలో సమాధాన గోల్ సాధించింది. స్టార్ ఆటగాడు వినీసియస్ జూనియర్ అద్భుత నైపుణ్యంతో బంతిని జాలిలో పడేసి స్కోరును 1-1గా సమం చేశాడు.
తదుపరి సమయం మొత్తం ఇరు జట్లు విజయం కోసం హోరాహోరీగా పోరాడినా మరో గోల్ మాత్రం రాలేదు. ముఖ్యంగా తొలి అర్ధభాగంలో మొరాకో జట్టు స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. పదేపదే బ్రెజిల్ గోల్‌పోస్ట్‌పై దాడులు సాగించింది. రెండో అర్ధభాగంలో బ్రెజిల్ దూకుడు పెంచినా మొరాకో రక్షణను ఛేదించలేకపోయింది.
గణాంకాల పరంగా చూస్తే బంతి నియంత్రణలో బ్రెజిల్ స్వల్ప ఆధిక్యం సాధించింది. మొత్తం మ్యాచ్‌లో 54 శాతం సమయం బంతి బ్రెజిల్ ఆధీనంలోనే ఉన్నా, అందిన అవకాశాలను గోల్స్‌గా మలచడంలో మాత్రం విఫలమైంది. లక్ష్యాన్ని దిశగా బ్రెజిల్ ఆటగాళ్లు 5 సార్లు, మొరాకో ప్లేయర్లు 4 సార్లు షాట్లు కొట్టారు. బ్రెజిల్‌కు 6 కార్నర్లు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ఈ డ్రా బ్రెజిల్‌కు పెద్ద షాక్‌గా భావిస్తున్నారు. 1934 నుంచి ఇప్పటివరకు సాకర్ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌ల్లో బ్రెజిల్ జట్టు ఎప్పుడూ గెలుపుతోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొత్తం 17 సార్లు తొలి మ్యాచ్‌ల్లో విజయం సాధించిన సాంబా జట్టు ఈసారి మాత్రం ఆ పరంపరను కొనసాగించలేకపోయింది.
ఇక ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్ లేకపోవడం కూడా జట్టు బలాన్ని కొంత మేర దెబ్బతీసినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అతడి గైర్హాజరీలో బ్రెజిల్ దాడుల్లో కచ్చితత్వం తగ్గినట్లు కనిపించింది. మరోవైపు మొరాకో మాత్రం క్రమశిక్షణతో రక్షణ, వేగవంతమైన కౌంటర్ దాడులతో మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది.







