ఒక్క మ్యాచ్‌ గెలవకుండానే నాకౌట్‌ దశకు చేరిన కాబో వెర్డె

ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో కాబో వెర్డె జట్టు అరుదైన రికార్డు సృష్టించింది. సుమారు 5.30 లక్షల జనాభా కలిగిన ఈ చిన్న ఆఫ్రికా దేశం తొలిసారి ప్రపంచ కప్‌ ఫుట్‌బాల్‌ బరిలోకి దిగినప్పటికీ, ఒక్క మ్యాచ్‌లో కూడా విజయం సాధించకుండానే నాకౌట్‌ దశకు చేరి సంచలనం సృష్టించింది. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌లు ఆడిన ఈ జట్టు మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించి, రెండో స్థానంతో రౌండ్‌ ఆఫ్‌ 32కు అర్హత సాధించింది.

గ్రూప్‌ Hలో స్పెయిన్‌, ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లతో కలిసి కాబో వెర్డె పోటీపడింది. స్పెయిన్‌ మూడు మ్యాచ్‌లలో రెండు విజయాలు, ఒక డ్రాతో ఏడు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌ దశకు చేరుకుంది. కాబో వెర్డె మాత్రం మూడు మ్యాచ్‌లను డ్రాగా ముగించి మూడు పాయింట్లు సాధించింది. గోల్స్‌ తేడా ఆధారంగా రెండో స్థానాన్ని కైవసం చేసుకుని నాకౌట్‌ దశకు దూసుకెళ్లింది. ఈ జట్టు రౌండ్‌ ఆఫ్‌ 32లో అర్జెంటీనా జట్టుతో తలపడనుంది.

ఇదే గ్రూప్‌లో స్పెయిన్‌తో జరిగిన కీలక పోరులో ఉరుగ్వే 1-0 తేడాతో ఓటమి చెందింది. ఈ ఫలితంతో ఉరుగ్వే, సౌదీ అరేబియా జట్లు గ్రూప్‌ దశకే పరిమితమై ఇంటి ముఖం పట్టాయి. కాబో వెర్డె మాత్రం మూడు డ్రాలతోనే చరిత్రాత్మకంగా నాకౌట్‌ దశకు చేరి ప్రపంచ ఫుట్‌బాల్‌ వేదికపై తన ముద్ర వేసింది.

ఇక మరో గ్రూప్‌ పోటీల్లో ఫ్రాన్స్‌ జట్టు తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఫిఫా ప్రపంచ కప్‌ 2026లో ఫ్రాన్స్‌ వరుసగా మూడు విజయాలు నమోదు చేసి గ్రూప్‌ Iలో అగ్రస్థానంతో నాకౌట్‌ దశకు చేరుకుంది. నార్వేతో జరిగిన మ్యాచ్‌లో ఫ్రాన్స్‌ ఆటగాడు ఉస్మాన్‌ డెంబెలె హ్యాట్రిక్‌ గోల్స్‌ నమోదు చేసి జట్టుకు ఘన విజయం అందించాడు.

నార్వేపై పోరులో డెంబెలె మ్యాచ్‌ ప్రారంభమైన 7వ నిమిషంలో తొలి గోల్‌ చేసి ఫ్రాన్స్‌కు ఆధిక్యం ఇచ్చాడు. 20వ నిమిషంలో రెండో గోల్‌ నమోదు చేయడంతో ఫ్రాన్స్‌ 2-0 లీడ్‌లోకి వెళ్లింది. వెంటనే 21వ నిమిషంలో ధెలో అస్గార్డ్‌ గోల్‌ చేయడంతో నార్వే 2-1తో పోటీలోకి తిరిగి వచ్చింది. అయితే 32వ నిమిషంలో డెంబెలె మూడో గోల్‌ చేసి హ్యాట్రిక్‌ పూర్తి చేయడంతో ఫ్రాన్స్‌ 3-1 ఆధిక్యం సాధించింది.

మ్యాచ్‌ ముగింపు దశలో 90+4వ నిమిషంలో డిసైర్‌ డౌయ్‌ గోల్‌ చేయడంతో ఫ్రాన్స్‌ 4-1 తేడాతో నార్వేపై విజయం సాధించింది. ఇదే గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో సెనెగల్‌ జట్టు ఇరాక్‌పై 5-0 తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఈ ఫలితాలతో ఫ్రాన్స్‌, నార్వే, సెనెగల్‌ జట్లు నాకౌట్‌ దశకు అర్హత సాధించాయి.