టీమిండియా మాజీ క్రికెటర్, తెలుగు ఆటగాడు హనుమ విహారి భారత జట్టు ఎంపిక విధానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. వరుసగా విఫలమవుతున్నప్పటికీ అభిషేక్ శర్మకు జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్‌లో అవకాశాలు కొనసాగిస్తూ ఉండటం పట్ల మండిపడ్డాడు. మరోవైపు టీ20 ప్రపంచ కప్‌ 2026లో అద్భుత ప్రదర్శన చేసిన సంజు శాంసన్‌కు మాత్రం సరైన అవకాశాలు ఇవ్వకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తాడు.

సంజు శాంసన్ 2-3 మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడనే కారణంతో జట్టు నుంచి తప్పించారని, అదే సమయంలో అభిషేక్ శర్మను మాత్రం వరుసగా అవకాశాలు ఇస్తున్నారని హనుమ విహారి విమర్శించాడు. అభిషేక్‌కు ఒక రూల్, సంజుకు మరో రూల్ అమలు చేస్తున్నారా అని బీసీసీఐ సెలెక్టర్లను నిలదీశాడు.

హనుమ విహారి తన యూట్యూబ్ ఛానెల్‌లో జట్టు ఎంపికపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. సంజు శాంసన్, అభిషేక్ శర్మల ప్రదర్శనలను పోల్చుతూ సెలెక్టర్ల నిర్ణయాలను ప్రశ్నించాడు.

ప్రపంచ కప్‌కు ముందు సంజు శాంసన్ ఐదు మ్యాచ్‌ల్లో రాణించకపోవడంతో తుది జట్టులో స్థానం కోల్పోయాడు. తిరిగి అవకాశం వచ్చిన తర్వాత ప్రపంచ కప్‌లో అద్భుత ప్రదర్శన చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ ప్రదర్శనను పరిశీలిస్తే పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో ఒక అర్ధశతకం మినహా అభిషేక్ బ్యాట్ నుంచి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ రాలేదు. 20 లేదా 30 పరుగుల ఇన్నింగ్స్ కూడా లేవు. చివరి ఎనిమిది మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం మాత్రమే చేశాడు. ప్రపంచ కప్ మ్యాచ్‌లను కలుపుకుంటే చివరి 18 ఇన్నింగ్స్‌లో కేవలం మూడు అర్ధ శతకాలే ఉన్నాయి

సంజు శాంసన్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ వరుసగా అర్ధ శతకాలు సాధించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయినప్పటికీ ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ వంటి యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడంతో అతడు మళ్లీ ప్లేయింగ్ ఎలెవన్‌కు దూరమయ్యాడు. సంజూను ఇన్‌కన్సిస్టెంట్ అంటారు. అది సరే కానీ ఒత్తిడి పరిస్థితుల్లో మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించే సామర్థ్యం అతనికి ఉంది. అభిషేక్ శర్మ చుట్టూ భారీ హైప్ ఉంది. కానీ సంజు కూడా ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించాడు. ఇద్దరు ఆటగాళ్ల విషయంలో ఎందుకు వేర్వేరు ప్రమాణాలు పాటిస్తున్నారు?

హనుమ విహారి వ్యాఖ్యలతో బీసీసీఐ సెలెక్టర్ల ఎంపిక విధానం మరోసారి చర్చకు రావడం గమనార్హం. సంజు శాంసన్, అభిషేక్ శర్మల అవకాశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలు ఉన్నాయనే అంశంపై క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చిస్తున్నారు. విహారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.