హైదరాబాద్‌: టీజీ 20 లీగ్‌ తొలి సీజన్‌లో విజేతగా నిలిచిన ‘హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌’ ఫ్రాంచైజీ యాజమాన్యం బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు అందుకుంది. ఈ సందర్భంగా లీగ్‌ విజయవంతం, జట్టు ప్రదర్శన, రాష్ట్రంలో క్రికెట్‌ అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరిగింది.

సీఎంను కలిసిన వారిలో రామోజీ గ్రూప్‌ సంస్థల సీఎండీ సీహెచ్‌ కిరణ్‌, ఈటీవీ భారత్‌ డైరెక్టర్‌ బృహతి, దివిజ, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ డైరెక్టర్‌ సాంబశివరావు, ఈటీవీ ఎండీ బాపినీడు, బ్యాడ్మింటన్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌, ‘హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌’ జట్టు సభ్యులు ఉన్నారు. టీజీ 20 లీగ్‌లో తమ జట్టు ప్రదర్శన, అభిమానుల స్పందనపై వారు సీఎం రేవంత్‌రెడ్డికి వివరాలు తెలియజేశారు.

టీజీ 20 లీగ్‌ తొలి విజేతగా నిలిచిన ‘హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌’ జట్టుకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. జట్టు ఆటగాళ్ల కృషి, క్రమశిక్షణ, జట్టు భావనను ప్రశంసించారు. అనంతరం విజేత జట్టు సభ్యులకు నగదు బహుమతుల చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి అందజేశారు.

ఈ సందర్భంగా టీజీ 20 లీగ్‌ నిర్వహణ, ప్రేక్షకుల హాజరు, టోర్నీకి వచ్చిన ఆదరణపై కూడా చర్చ జరిగింది. రాష్ట్రంలో క్రికెట్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి ముందుకు తేవడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

టీజీ 20 లీగ్‌ ద్వారా స్థానిక యువ క్రికెటర్లకు పెద్ద వేదిక లభించిందని, భవిష్యత్తులో మరిన్ని ప్రతిభలు వెలుగులోకి వస్తాయని అధికార ప్రతినిధులు పేర్కొన్నారు. లీగ్‌ విజయవంతం కావడంలో నిర్వాహకులు, ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు, అభిమానులందరి పాత్ర కీలకమని వారు అభిప్రాయపడ్డారు.

“క్రికెట్‌లో యువత ఎదిగేందుకు ఈ లీగ్‌ బాగా ఉపయోగపడుతుంది. ఆటపై చూపిన కమిట్‌మెంట్‌ వల్లే సచిన్‌లాంటి వాళ్లు ఆ స్థాయికి ఎదిగారు. ‘ఈనాడు’, ‘ఈటీవీ’ సంస్థలు మీ వెనుక నిలబడ్డాయి. క్రికెటర్లకు ఈ సంస్థలు వెయ్యి ఏనుగుల బలంతో పాటు ఎదగడానికి కావాల్సిన అన్నింటినీ ఇస్తాయి. గతంలో క్రికెటర్లకు ఇలాంటి సంస్థల అండ లభించలేదు. దేశ ప్రతిష్ఠను పెంచే క్రీడాకారులు వెలుగులోకి రావాలని ఆశిస్తున్నా”

అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జట్టు సభ్యులను ఉద్దేశించి అన్నారు.

టీజీ 20 లీగ్‌ తొలి సీజన్‌ విజయవంతంగా పూర్తికావడం, ‘హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌’ విజేతగా నిలవడం రాష్ట్ర క్రీడా రంగానికి ప్రోత్సాహకర పరిణామంగా క్రీడా వర్గాలు అభివర్ణిస్తున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి లీగ్‌ల ద్వారా తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని క్రికెటర్లు వెలుగులోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.