ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో టీమిండియా వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దుమ్మురేపాడు. అఫ్గానిస్థాన్‌తో ఇటీవల ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసిన గిల్ బ్యాటింగ్ విభాగంలో ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి రెండు వన్డేల్లో గిల్ 84, 154 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ఉన్న న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ కంటే గిల్ కేవలం 24 రేటింగ్ పాయింట్ల వెనుకంజలో ఉన్నాడు. మరోవైపు, తొడకండరాల గాయం కారణంగా ఈ సిరీస్‌కు దూరమైన విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి మూడో ర్యాంకుకు పడిపోగా.. రోహిత్ శర్మ నాలుగో స్థానంలోనే కొనసాగుతున్నాడు.