రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: గాలె వేదికగా శ్రీలంక, భారత్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట వర్షం అంతరాయం మధ్య కొనసాగింది. 288/2 స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా, రోజు ముగిసే సమయానికి 460/9తో నిలిచింది. కుల్‌దీప్ యాదవ్ 12, ప్రసిద్ధ్ కృష్ణ 1 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఉదయం నుంచి కురిసిన వర్షం కారణంగా రెండో రోజు తొలి సెషన్ పూర్తిగా వర్షార్పణమైంది. షెడ్యూల్ ప్రకారం ఉదయం 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా, మైదానం తడిగా ఉండటంతో ఆట మొదలుకాలేదు. మైదానాన్ని సిద్ధం చేసేందుకు సమయం పట్టడంతో 12 గంటలకు ఉండాల్సిన లంచ్ విరామాన్ని 11.40 గంటలకే ఇచ్చారు. వర్షం ఆగిన తర్వాత కవర్లు తొలగించి మైదానాన్ని సిద్ధం చేసి, మధ్యాహ్నం 2.35 గంటలకు రెండో సెషన్ ప్రారంభించారు. ఈ సెషన్ సాయంత్రం 4 గంటల వరకు, అనంతరం 4.20 నుంచి 6 గంటల వరకు చివరి సెషన్ నిర్వహించారు. మొత్తం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది.
రెండో రోజు మొదటి ఏడు ఓవర్లలో భారత్ 17 పరుగులు జోడించింది. 80 ఓవర్లకు స్కోరు 305/2గా ఉండగా, దేవదత్ పడిక్కల్ 138, రిషభ్ పంత్ 37 పరుగులతో క్రీజులో ఉన్నారు. 81 ఓవర్లకు 307 పరుగుల వద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. రిషభ్ పంత్ 39 పరుగుల వద్ద కేశర నువాంత బౌలింగ్‌లో సోనల్ దినూషకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
నిన్న రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన కేఎల్ రాహుల్ 77 పరుగులతో తిరిగి క్రీజులోకి వచ్చాడు. 85 ఓవర్లకు భారత్ స్కోరు 321/4. రాహుల్ 82 పరుగుల వద్ద కేశర నువాంత బౌలింగ్‌లో షార్ట్ లెగ్‌లో నిషాన్ ఫెర్నాండోకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ సమయంలో దేవదత్ పడిక్కల్ 146 పరుగులతో, ధ్రువ్ జురెల్ 1 పరుగుతో ఉన్నారు.
తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడినా, డబుల్ సెంచరీ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. 230 బంతుల్లో 167 పరుగులు చేసిన పడిక్కల్, ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో స్టంపౌట్‌గా ఔటయ్యాడు. టీ విరామ సమయానికి భారత్ స్కోరు 364/5, రవీంద్ర జడేజా 4, ధ్రువ్ జురెల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.
తరువాత భారత్ ఆరో వికెట్‌గా జడేజాను కోల్పోయింది. 13 పరుగుల వద్ద కేశర నువాంత బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అవడంతో జడేజా వెనుదిరిగాడు. 99 ఓవర్లకు భారత్ స్కోరు 377/6, మానవ్ సుతార్ 0, ధ్రువ్ జురెల్ 22 పరుగులతో ఉన్నారు. 107 ఓవర్లకు స్కోరు 415/6కు చేరగా, జురెల్ 43, సుతార్ 12 పరుగులతో క్రీజులో నిలకడగా ఆడారు.
ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధ్రువ్ జురెల్ 68 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రభాత్ జయసూర్య బౌలింగ్‌లో లంక కెప్టెన్ ధనంజయ ఫస్ట్ స్లిప్‌లో అందమైన క్యాచ్ పట్టడంతో జురెల్ ఔటయ్యాడు. 110 ఓవర్లకు భారత్ స్కోరు 433/7, మానవ్ సుతార్ 21, మహ్మద్ సిరాజ్ 0 పరుగులతో ఉన్నారు.
రెండో రోజు మొత్తం భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 172 పరుగులు జోడించింది. లంక బౌలర్లలో ప్రభాత్ జయసూర్య 4 వికెట్లు, కేశర నువాంతు 3 వికెట్లు, అసిత ఫెర్నాండో ఒక వికెట్ తీశారు.
ఇక మ్యాచ్ ప్రారంభం నుంచే వరుణుడు అడ్డంకిగా మారాడు. తొలి రోజు కూడా వర్షం కారణంగా 73 ఓవర్ల ఆట మాత్రమే జరగగా, రోజు ముగిసే సమయానికి భారత్ స్కోరు 288/2గా ఉంది. అప్పటికి దేవదత్ పడిక్కల్ 131*, రిషభ్ పంత్ 27* పరుగులతో క్రీజులో ఉండగా, యశస్వి జైస్వాల్ 32, శుభ్‌మన్ గిల్ 16 పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ 77* పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లాడు.
వర్షం అంతరాయం ఉన్నప్పటికీ, తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు నిలకడగా ఆడి భారీ స్కోరు నమోదు చేయడంతో గాలె టెస్టులో టీమ్‌ఇండియా బలమైన స్థితిలో నిలిచింది.







