రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: దులీప్ ట్రోఫీ 2026 క్వార్టర్ ఫైనల్‌లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ బౌలింగ్‌తో మెరిశాడు. ఐపీఎల్‌లో బ్యాటింగ్‌తో సూపర్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న ఈస్ట్ జోన్ ఆటగాడు, ఈసారి దులీప్ ట్రోఫీలో బంతితో తన ప్రతిభను చాటాడు. 15 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ స్థాయిలో ఆడుతున్న ఈ యూనివర్సల్ బేబీ బాస్, కీలక సమయంలో స్పిన్ మ్యాజిక్‌తో నార్త్ ఈస్ట్ జోన్‌పై ఒత్తిడి పెంచాడు.
ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన వైభవ్, నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌కు వచ్చి ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను కుదేలు చేశాడు. ఎడమచేతి వాటం స్లో ఆర్థడాక్స్ స్పిన్నర్‌గా బౌలింగ్ చేసిన వైభవ్, 27వ ఓవర్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ ఆధిపత్యాన్ని మరింత బలపరిచాడు.
ఈ మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 111 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన ఈస్ట్ జోన్ 467 పరుగుల భారీ స్కోరు చేసి ప్రత్యర్థిపై భారీ ఆధిక్యం సాధించింది. ఫాలోఆన్ ఒత్తిడిలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన నార్త్ ఈస్ట్ జోన్, మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది.
ఇలాంటి పరిస్థితుల్లో 27వ ఓవర్ బౌలింగ్‌కు వచ్చిన వైభవ్, ఓవర్ రెండో బంతికి కిషన్ లింగ్డోను 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేశాడు. అదే ఓవర్‌లో ఐదో బంతికి ఇమ్లివాటి లెమ్టూర్‌ను పెవిలియన్‌కు పంపి రెండో వికెట్ సాధించాడు. ఈ రెండు కీలక వికెట్లతో నార్త్ ఈస్ట్ జోన్ పరిస్థితి మరింత క్లిష్టమైంది.
మొత్తం మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన వైభవ్, 11 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. బౌలింగ్‌లో ఇలా అదరగొట్టిన వైభవ్, బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో అతను 6 బంతులు ఎదుర్కొని 8 పరుగులు చేసి ఔట్ అయిన విషయం తెలిసిందే.
రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ ఈస్ట్ జోన్ 102 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది. భారీ ఆధిక్యంతో ముందంజలో ఉన్న ఈస్ట్ జోన్, ఈ మ్యాచ్‌లో స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ ప్రదర్శన, ఈస్ట్ జోన్ విజయావకాశాలను మరింత బలపరిచినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.













