భారత్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ కోసం ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఆఫ్ఘనిస్తాన్ జట్టును ప్రకటించింది. 2026 సెప్టెంబర్ 13 నుంచి 17 వరకు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు మూడు టీ20 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి.

ఈ సిరీస్‌కు ఇబ్రహీం జద్రాన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. భారత్‌తో జరిగే ఈ సిరీస్ ఇబ్రహీం జద్రాన్‌కు నాయకుడిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకునే మంచి అవకాశంగా భావిస్తున్నారు. 2028 టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టును బలోపేతం చేయడం, కీలక ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలు సాధించడం ఆఫ్ఘనిస్తాన్ లక్ష్యంగా కనిపిస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ జట్టులో ప్రధాన ఆకర్షణగా ఫాస్ట్ బౌలర్ నవీన్-ఉల్-హక్ తిరిగి రావడం నిలిచింది. భుజం గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న నవీన్-ఉల్-హక్ పూర్తి ఫిట్‌నెస్‌తో మళ్లీ జట్టులోకి చేరాడు. అతని రాకతో ఆఫ్ఘనిస్తాన్ పేస్ బౌలింగ్ విభాగానికి మరింత బలం చేకూరనుందని జట్టు వర్గాలు భావిస్తున్నాయి.

అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ గుల్బదిన్ నైబ్ కూడా జట్టులోకి తిరిగి వచ్చాడు. బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఉపయోగపడే గుల్బదిన్ నైబ్ మిడిల్ ఆర్డర్‌కు అదనపు బలాన్ని అందించనున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ వికెట్ కీపర్-బ్యాటర్ నూర్ రహ్మాన్‌కు తొలిసారి ఆఫ్ఘనిస్తాన్ టీ20 జట్టులో చోటు లభించింది. ప్రధాన వికెట్ కీపర్ రహ్మానుల్లా గుర్బాజ్‌కు బ్యాకప్‌గా నూర్ రహ్మాన్‌ను ఎంపిక చేశారు.

ఆఫ్ఘనిస్తాన్‌కు ఎప్పటినుంచో ప్రధాన బలంగా ఉన్న స్పిన్ బౌలింగ్ విభాగంలో ఈసారి కూడా స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. రషీద్ ఖాన్‌తో పాటు నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్ వంటి స్పిన్నర్లు భారత పిచ్‌లపై తమ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నారు. అనుభవజ్ఞుడైన మహ్మద్ నబీ కూడా జట్టులో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ కీలక పాత్ర పోషించగల మహ్మద్ నబీ జట్టు సమతుల్యతకు ఉపయోగపడనున్నాడు.

భారత్‌తో టీ20 సిరీస్‌కు ఆఫ్ఘనిస్తాన్ పూర్తి జట్టు ఇలా ఉంది: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), నూర్ రహ్మాన్ (వికెట్ కీపర్), సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, అజ్మతుల్లా ఉమర్జాయ్, గుల్బదిన్ నైబ్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, నంగ్యాల్ ఖరోతీ, ముజీబ్ హజ్‌మద్, నూర్ అహ్మద్, ఫరూకీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, నవీన్-ఉల్-హక్. రిజర్వ్ ఆటగాళ్లు: ఇజాజ్ అహ్మద్జాయ్, షాహిదుల్లా కమల్, ఫరీద్ అహ్మద్ మాలిక్.

భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్: 1వ టీ20 – సెప్టెంబర్ 13, 2026, అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, న్యూఢిల్లీ; 2వ టీ20 – సెప్టెంబర్ 15, 2026, అదే వేదిక; 3వ టీ20 – సెప్టెంబర్ 17, 2026, అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, న్యూఢిల్లీ.