రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: దిల్లీ: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో భారత జట్టు లేకపోయినా దేశంలో ఈ మహా టోర్నీపై ఉత్సాహం ఏమాత్రం తగ్గదు. అర్జెంటీనా, బ్రెజిల్ వంటి జట్లకు భారత్‌లో ఉన్న అభిమాన వర్గం విపరీతం. లక్షలాది మంది అభిమానులు ప్రపంచకప్ ఆరంభానికి రోజులు లెక్కపెడుతున్నారు. అయితే ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా టోర్నీలో భారత జట్టు లేకపోవడం అభిమానుల్లో కొంత వెలితిని మిగులుస్తోంది. సమీప భవిష్యత్తులోనూ భారత్ ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆడే అవకాశాలు కనిపించకపోవడం మరింత నిరాశ కలిగిస్తోంది.
అయినా సరే భారత సంతతి ఆటగాళ్లు మాత్రం ప్రపంచకప్ వేదికపై తమ ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు. సర్‌ప్రీత్ సింగ్, శామ్యూల్ ముత్తుసామి, నిషాన్ వేలుపిళ్లై, తెహ్‌సిన్ మహ్మద్ అనే నలుగురు ఆటగాళ్లు ఈసారి ప్రపంచకప్‌లో బరిలోకి దిగనున్నారు. ఫ్రెంచ్ మిడ్‌ఫీల్డర్ వికాశ్ దొరాసూ అడుగుజాడల్లో వీరు నడుస్తున్నట్టు చెప్పొచ్చు. వికాశ్ 2006 ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఆయన ముత్తాతల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం కావడం విశేషం.
ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆడబోయే ఈ నలుగురు భారత సంతతి ఆటగాళ్ల గురించి వివరాలు ఇలా ఉన్నాయి.
సర్‌ప్రీత్ సింగ్ (న్యూజిలాండ్)
సర్‌ప్రీత్ సింగ్ ఆక్లాండ్‌లో పంజాబీ తల్లిదండ్రులకు జన్మించాడు. 2018లో కివీస్ అండర్–23 డెవలప్‌మెంట్ జట్టు సభ్యుడిగా ఇంటర్‌కాంటినెంటల్ కప్ కోసం భారత్ పర్యటించినప్పుడు, భారత జట్టుతో కూడా ఒక మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది న్యూజిలాండ్ సీనియర్ జట్టుతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జర్మన్ మొదటి డివిజన్ లీగ్‌లో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2019లో బయెర్న్ మ్యూనిచ్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 27 ఏళ్ల సర్‌ప్రీత్ ఇప్పటివరకు న్యూజిలాండ్ తరఫున 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు.
శామ్యూల్ ముత్తుసామి (డీఆర్ కాంగో)
కాంగోకు చెందిన తల్లి, తమిళ మూలాలున్న భారత సంతతి తండ్రికి ఫ్రాన్స్‌లో జన్మించాడు శామ్యూల్ ముత్తుసామి. ప్రస్తుతం 29 ఏళ్ల ముత్తుసామి గ్రీక్ సూపర్ లీగ్ క్లబ్ అర్టొమిటోస్ తరఫున ఆడుతున్నాడు. 2019లో డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన అతడు ఇప్పటివరకు 57 మ్యాచ్‌లు ఆడాడు. మిడ్‌ఫీల్డర్‌గా ఆడే ముత్తుసామి ఫ్రాన్స్‌లో ఎఫ్‌సీ నాంటెస్, తుర్కియేలో ఒజ్బెల్సాన్ సివస్పోర్ జట్లకు కూడా ప్రాతినిధ్యం వహించాడు.
నిషాన్ వేలుపిళ్లై (ఆస్ట్రేలియా)
నిషాన్ వేలుపిళ్లై మెల్‌బోర్న్‌లో జన్మించాడు. అతడి తల్లి ఆంగ్లో–ఇండియన్, తండ్రి మలేసియాకు చెందినవాడు. వారి పూర్వీకులు శ్రీలంక తమిళులు. 25 ఏళ్ల నిషాన్ ఆస్ట్రేలియా అగ్రశ్రేణి ఎ–లీగ్‌లో మెల్‌బోర్న్ విక్టరీ తరఫున ఆడుతున్నాడు. 2026 ప్రపంచకప్ క్వాలిఫికేషన్ రౌండ్ సందర్భంగా 2024లో తొలిసారి ఆస్ట్రేలియా జట్టులో చోటు దక్కించుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి దిగిన నిషాన్ చైనాపై గోల్ సాధించాడు. అనంతరం ఆసీస్ తరఫున మరో ఏడు మ్యాచ్‌లు ఆడాడు. అతడు చేసిన మూడు గోల్స్ అన్నీ ప్రపంచకప్ క్వాలిఫయర్స్‌లోనే రావడం ప్రత్యేకత.
తెహ్‌సిన్ మహ్మద్ (ఖతార్)
తెహ్‌సిన్ మహ్మద్ 2006లో దోహాలో మళయాళీ తల్లిదండ్రులకు జన్మించాడు. వారి స్వస్థలం కేరళలోని కన్నూర్. తండ్రి ప్రోత్సాహంతో ఫుట్‌బాల్‌లో అడుగుపెట్టిన తెహ్‌సిన్ ఖతార్ స్టార్స్ లీగ్‌లో ఆడిన తొలి భారత సంతతి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అల్ దుహైల్ ఎస్‌సీ తరఫున ఆడుతున్నాడు. 2024లో ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సందర్భంగా ఖతార్ జట్టుతో అరంగేట్రం చేసిన ఈ లెఫ్ట్ వింగర్ ఆఫ్గానిస్థాన్‌పై మ్యాచ్‌లో బరిలోకి దిగాడు.







