రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ప్రపంచ పారా ఆర్చరీ సిరీస్‌లో భారత ఆర్చర్లు దూకుడు చూపించారు. విజువల్లీ ఇంపైర్డ్ 1 విభాగంలో ముగ్గురు భారత క్రీడాకారులు సెమీఫైనల్ దశకు చేరుకోవడంతో దేశానికి కనీసం రెండు పతకాలు ఖరారయ్యాయి.
ఆదివారం జరిగిన రెండో రోజు పోటీల్లో విజువల్లీ ఇంపైర్డ్ 1 కేటగిరీలో యుగళ్ గార్గ్, పవన్ కుమార్, తన్వి ప్రవీణ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించారు. క్వార్టర్ ఫైనల్‌లో యుగళ్ గార్గ్ 6-0 తేడాతో అర్ణవ్‌పై గెలిచాడు. అదే స్కోర్‌తో పవన్ కుమార్ గోవిందన్‌ను ఓడించాడు. తన్వి ప్రవీణ్‌కు బై లభించడంతో నేరుగా సెమీఫైనల్‌కు చేరాడు.
సెమీఫైనల్‌లో పవన్ కుమార్–తన్వి ప్రవీణ్ ఒకరితో ఒకరు తలపడనున్నారు. మరో సెమీఫైనల్‌లో యుగళ్ గార్గ్ సైప్రస్‌కు చెందిన మిసోస్‌తో పోటీ పడనున్నాడు. ఈ కేటగిరీలో తుది నాలుగులో ముగ్గురు భారత క్రీడాకారులు ఉండటం వల్ల భారత్‌కు కనీసం రెండు పతకాలు ఖాయం అయినట్టే అయింది.
మహిళల కాంపౌండ్ సింగిల్స్ క్వాలిఫికేషన్‌లో భారత స్టార్ ఆర్చర్ శీతల్ దేవి అద్భుత ప్రదర్శన కనబరిచింది. 698 పాయింట్లు సాధించిన ఆమె అగ్రస్థానాన్ని దక్కించుకుంది. టీమ్ విభాగంలో కూడా భారత్ ఆధిపత్యం చాటింది. 1368 పాయింట్లతో భారత మహిళల జట్టు మొదటి స్థానంలో నిలిచి నేరుగా సెమీఫైనల్‌కు చేరింది.
పురుషుల కాంపౌండ్ సింగిల్స్ క్వాలిఫికేషన్‌లో రాకేశ్ 702 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. టీమ్ విభాగంలో రాకేశ్, తోమన్, శ్యామ్‌లతో కూడిన భారత జట్టు 1398 పాయింట్లు సాధించి తుది నాలుగు జట్ల జాబితాలో చోటు దక్కించుకుంది.
మిక్స్‌డ్ కాంపౌండ్ టీమ్ విభాగంలో శీతల్ దేవి, రాకేశ్ జోడీ చరిత్ర సృష్టించింది. క్వాలిఫికేషన్‌లో 1400 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డు స్థాయిలో ప్రదర్శన కనబరిచిన ఈ జంట అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఫలితాలతో భారత్ తొలిసారిగా ఆతిథ్యమిస్తున్న ఈ అంతర్జాతీయ పారా ఆర్చరీ ఈవెంట్‌లో దేశీయ క్రీడాకారులు తొలి రోజే తమ సత్తాను చాటినట్టైంది.







