రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్:
ఫిఫా ప్రపంచకప్ 2026: నాకౌట్‌కు మెక్సికో దూసుకెళ్లింది
ఫిఫా ప్రపంచకప్ 2026లో గురువారం నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. ఆతిథ్య జట్లైన మెక్సికో, కెనడా ఘన విజయాలు నమోదు చేశాయి. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచిన మెక్సికో నాకౌట్ దశకు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. మరో ఆతిథ్య జట్టు కెనడా ఖతార్‌పై ఆరు గోల్స్ తేడాతో గెలిచి తన దూకుడును చాటింది. స్విట్జర్లాండ్ బోస్నియాపై భారీ విజయంతో మెరిపించగా, దక్షిణాఫ్రికా–చెకియా మ్యాచ్ సమాన స్కోరుతో ముగిసింది.
దక్షిణాఫ్రికా–చెకియా మ్యాచ్ డ్రా
గురువారం అర్ధరాత్రి దక్షిణాఫ్రికా, చెకియా జట్లు తలపడ్డాయి. మ్యాచ్ ఆరంభంలోనే చెకియా ఆధిక్యంలోకి వెళ్లింది. ఆరో నిమిషంలో చెకియా ఆటగాడు మిచెల్ సాదిలిక్ గోల్ చేసి జట్టుకు ముందంజ అందించాడు. అనంతరం ఇరుజట్లు గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి. అయితే 83వ నిమిషంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ టెబోహో పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. దీంతో స్కోరు 1-1గా సమమై మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ గోల్‌తో దక్షిణాఫ్రికా ఓటమి నుంచి తప్పించుకుంది.
స్విస్ జట్టు ఘన విజయం
గ్రూప్ Bలో బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ 4-1 తేడాతో గెలిచింది. తొలి అర్ధభాగంలో ఇరుజట్లూ గోల్ చేయలేకపోయాయి. రెండోార్ధంలో స్విస్ దూకుడు పెంచింది. 74వ నిమిషంలో జొహన్ మంజాబి గోల్ చేసి స్విట్జర్లాండ్‌ను 1-0 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. 84వ నిమిషంలో రుబెన్ వర్గాస్ మరో గోల్ చేయడంతో స్కోరు 2-0 అయింది. 90వ నిమిషంలో మళ్లీ జొహన్ గోల్ చేసి స్విస్ ఆధిక్యాన్ని 3-0కు చేర్చాడు.
అదనపు సమయంలో బోస్నియా ఆటగాడు ఎమిన్ మహ్‌మిక్ 90+3వ నిమిషంలో గోల్ చేసి తేడాను 3-1కు తగ్గించాడు. అయితే 90+7వ నిమిషంలో గ్రానిట్ గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ 4-1 తేడాతో విజయం ఖరారు చేసుకుంది.
కెనడా 6-0తో ఖతార్‌పై గెలుపు
ప్రపంచకప్‌కు అమెరికా, మెక్సికోతో కలిసి ఆతిథ్యం ఇస్తున్న కెనడా తన రెండో మ్యాచ్‌లో ఖతార్‌ను 6-0 తేడాతో చిత్తు చేసింది. తొలి మ్యాచ్‌లో బోస్నియాతో డ్రా చేసుకున్న కెనడా ఈసారి ఆరంభం నుంచే ఆధిపత్యం ప్రదర్శించింది. 16వ నిమిషంలో కేల్ లెరిన్ గోల్ చేసి కెనడాకు తొలి ఆధిక్యం అందించాడు.
జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్‌తో మెరిశాడు. అతడు 29వ నిమిషం, 45+3వ నిమిషం, 90+2వ నిమిషాల్లో మూడు గోల్స్ సాధించాడు. కెనడా ఆటగాడు మహ్మద్ మనై 75వ నిమిషంలో మరో గోల్ చేసి స్కోరును 5-0కు చేర్చాడు. చివర్లో జొనాథన్ మూడో గోల్‌తో కెనడా స్కోరు 6-0గా నిలిచింది. ఖతార్ మాత్రం గోల్ పోస్టు వైపు బంతిని పంపడంలో కూడా విఫలమై పూర్తిగా నిరాశపరిచింది.
నాకౌట్‌కు మెక్సికో
ఆతిథ్య జట్టు మెక్సికో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి నాకౌట్ దశకు చేరిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. గ్రూప్ Aలో అగ్రస్థానాన్ని బలపరుచుకుంది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 1-0 తేడాతో గెలిచింది. 50వ నిమిషంలో మెక్సికో ఆటగాడు లూయిస్ రోమో గోల్ చేసి జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. సౌత్ కొరియా నుంచి గోల్ పోస్టు వైపు కేవలం రెండు షాట్లు మాత్రమే రావడం గమనార్హం. అవి కూడా ఫలించకపోవడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.







