క్రీడల వల్ల జీవితాలు ఎలా మారిపోతాయో పారా అథ్లెట్లే ప్రత్యక్ష ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శనివారం నిర్వహించిన ‘ఖేలో ఇండియా డైలాగ్’ కార్యక్రమంలో ఆయన వర్చువల్‌గా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వందలాది అథ్లెట్లు, విద్యార్థులు, వాలంటీర్లతో ప్రధాని ఆన్‌లైన్‌ ద్వారా సంభాషించారు.

ఒలింపిక్స్‌లో ఉన్న విభాగాల సగంలోనూ భారత్ నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం ఆందోళనకరమని మోదీ గుర్తుచేశారు. ఈ పరిస్థితిని మార్చేందుకు దేశం మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. పతకాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న క్రీడల్లోనే భారత క్రీడాకారులు పాల్గొనడం లేదని, ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న ధోరణి అని వివరించారు.

“ఒలింపిక్స్‌లో చాలా క్రీడాంశాలు ఉంటాయి. అందులో సగం క్రీడల్లో భారత అథ్లెట్లు పాల్గొనడం లేదు. పతకాలు ఎక్కువగా వచ్చే విభాగాల్లో మనం ఆడట్లేదు. ఇది దశాబ్దాలుగా జరుగుతోంది. 2012లో మనం కేవలం 13 క్రీడల్లోనే తలపడ్డాం. మరో 20 ఈవెంట్స్‌లో అడుగే పెట్టలేదు. అందులో కొన్ని పోటీలు ఎలా ఉంటాయో కూడా దేశంలోని చాలా మందికి తెలియదు. ఇది వినేందుకు కఠినంగా ఉన్నా.. చేదు నిజం. ఇతర దేశాల ప్లేయర్లు అందులోనే ఎక్కువగా పతకాలు సాధిస్తున్నారు. ఒలింపిక్స్‌లో మన పతకాల సంఖ్య పెరగాలంటే ఈ క్రీడల్లోనూ ప్రాతినిధ్యం ఉండాలి” అని మోదీ తెలిపారు.

ఇప్పటి వరకు ఒలింపిక్స్‌లో సర్ఫింగ్, స్పోర్ట్ క్లైంబింగ్ పోటీల్లో భారత్ నుంచి ఎవరూ పాల్గొనలేదని ప్రధాని ప్రస్తావించారు. సహజ వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకునే దిశగా ముందడుగు వేయాలని సూచించారు.

“మనకు అద్భుతమైన కోస్తా తీరం ఉంది. అలాగే కొండ ప్రాంతాలూ ఉన్నాయి. సహజ సిద్ధంగానే వనరులు ఉన్నప్పుడు ఇలాంటి క్రీడల్లో మన ప్రాతినిధ్యం పెరగాలి. అప్పుడే పతకాలను ఎక్కువ సాధించేందుకు అవకాశాలు మెరుగ్గా ఉంటాయి” అని ప్రధాని సూచించారు.

2028లో లాస్ ఏంజెలెస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పాల్గొనేలా చూడాలని ఇప్పటికే సంబంధిత వర్గాలకు మోదీ దిశానిర్దేశం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి.

ఒక అథ్లెట్ విజయం వ్యక్తిగత స్థాయిలో మాత్రమే కాకుండా, కుటుంబం నుంచి దేశం వరకు అందరికీ గౌరవం తీసుకొస్తుందని ప్రధాని పేర్కొన్నారు. పారా అథ్లెట్ల విజయాలు ఇందుకు మంచి ఉదాహరణగా నిలుస్తున్నాయని అన్నారు.

“ఒక అథ్లెట్ సక్సెస్ అయితే.. కేవలం వారి వరకే ఆ ఫలితాలు ఉండవు. కుటుంబం, పాఠశాల, కళాశాల, జిల్లా, రాష్ట్రం, దేశం గురించి ప్రపంచం మొత్తం తెలుసుకుంటుంది. అందుకు పారా అథ్లెట్ల జీవితమే ప్రత్యక్ష ఉదాహరణ. కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వీరంతా నాలో స్ఫూర్తి నింపారు” అని మోదీ వెల్లడించారు.