రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ప్రతిష్ఠాత్మక నార్వే చెస్ టోర్నీలో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. జర్మనీకి చెందిన విన్సెంట్ కీమర్‌పై గెలుపొందిన ప్రజ్ఞానంద, నార్వే చెస్ టోర్నీ టైటిల్ సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.
ఈ విజయానంతరం ప్రజ్ఞానంద తన తల్లిదండ్రులతో కలిసి తమిళనాడు సెక్రటేరియట్‌లో ముఖ్యమంత్రి సీఎం విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా సీఎం విజయ్ కొద్దిసేపు ప్రజ్ఞానందతో సరదాగా చెస్ ఆడారు. తక్కువ ఎత్తుల్లోనే ప్రజ్ఞానంద సీఎం విజయ్‌కు చెక్ పెట్టిన ఘటన అక్కడి వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మార్చింది.
నార్వే చెస్ టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చి టైటిల్ సాధించినందుకు ప్రజ్ఞానందను సీఎం విజయ్ అభినందించారు. అతడి విజయంతో తమిళనాడు గర్వపడుతోందని పేర్కొన్నారు. రాష్ట్రానికి కీర్తి తీసుకువచ్చిన ప్రజ్ఞానంద భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించాలని సీఎం ఆకాంక్ష వ్యక్తం చేశారు. తరువాత ప్రభుత్వం తరఫున ప్రజ్ఞానందకు రూ.50 లక్షల నగదు బహుమతిని చెక్కు రూపంలో సీఎం విజయ్ అందజేశారు. యువ ప్రతిభను ప్రోత్సహించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
సమావేశం అనంతరం ప్రజ్ఞానంద మీడియాతో మాట్లాడాడు. ముఖ్యమంత్రి చెస్ నైపుణ్యాలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని వెల్లడించాడు. ప్రజ్ఞానంద తాజా విజయంతో భారత చదరంగ క్రీడలో మరో మైలురాయి నమోదైంది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత తమిళనాడులో నుంచి ప్రపంచస్థాయిలో పేరు తెచ్చుకుంటున్న యువ గ్రాండ్‌మాస్టర్‌గా ప్రజ్ఞానందపై దేశవ్యాప్తంగా చెస్ అభిమానులు, నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు.







