హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించనున్న ‘TG20 లీగ్’ చుట్టూ లీగల్ వివాదాలు ముదురుతున్నాయి. ఈ లీగ్‌తో అధికారికంగా అసోసియేట్ అయిన టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో పాటు పలువురు క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ తరఫున లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019తో పాటు టోర్ట్ లా నిబంధనల ప్రకారం ఈ నోటీసులు పంపినట్లు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువా రెడ్డి తెలిపారు.

హైదరాబాద్‌లో జూన్ 17, 2026న నిర్వహించిన ప్రెస్ మీట్‌లో గురువా రెడ్డి ‘TG20 లీగ్’పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ లీగ్‌ను నిర్వహించేందుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని ఆయన అన్నారు.

రాష్ట్రంలో క్రీడల పరంగా ‘తెలంగాణ’ అనే పదాన్ని ఉపయోగించే చట్టపరమైన హక్కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు లేదని గురువా రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ క్రికెట్ వ్యవహారాలను పర్యవేక్షించడం, స్థానిక ప్రతిభను వెలికితీసి ముందుకు తీసుకెళ్లడం వంటి బాధ్యతలు ఇప్పటికే తెలంగాణ క్రికెట్ అసోసియేషన్‌దేనని ఆయన స్పష్టం చేశారు.

బీసీసీఐ అనుమతి లేకుండా కార్పొరేట్ కంపెనీలతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో హీరోలు విజయ్ దేవరకొండ, వెంకటేష్, తిలక్ వర్మ, అంబటి రాయుడు, మహ్మద్ సిరాజ్‌లకు లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించింది.

లీగ్ ప్రారంభానికి కనీసం 45 రోజుల ముందు బీసీసీఐ అనుమతి తీసుకోవాల్సి ఉండగా, ఆ అనుమతి లేకుండానే డబ్బులు వసూలు చేసి ఈ లీగ్ నిర్వహణకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రయత్నిస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ నోటీసులో పేర్కొంది. ఈ లీగ్‌కు ప్రమోషన్లు చేయడం, భాగస్వామ్యం వహించడం, ఎండార్స్‌మెంట్లు చేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ‘TG20 లీగ్’తో విజయ్ దేవరకొండకు ఉన్న పార్టనర్‌షిప్, ప్రమోషనల్ ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని, లేనిపక్షంలో వినియోగదారులను తప్పుదారి పట్టించే ప్రచారాల కింద చట్టపరమైన చర్యలు తప్పవని నోటీసులో స్పష్టంగా పేర్కొంది.

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జారీ చేసిన ఈ లీగల్ నోటీసులు టాలీవుడ్ వర్గాలతో పాటు క్రీడా వర్గాల్లో కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. ‘TG20 లీగ్’ భవిష్యత్తు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తదుపరి చర్యలపై ఆసక్తికర పరిస్థితి నెలకొంది.