రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాష్ట్రంలో నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 డిగ్రీ యాప్ మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరిఘల్లుకు చెందిన చంద్రశేఖర్ బుల్లెట్ వాహనాన్ని దొంగలు అపహరించిన ఘటనలో, ఆ యాప్ సాయంతో పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, గత నెల 27వ తేదీ రాత్రి చంద్రశేఖర్ బుల్లెట్ ద్విచక్ర వాహనంపై పులివెందుల నుంచి నల్లపురెడ్డిపల్లెకు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఓ ఆలయం వద్ద వాహనాన్ని నిలిపి, అక్కడి అరుగు మీద నిద్రించారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్‌ను అపహరించారు. ఘటనపై బాధితుడు పులివెందుల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వాహనాన్ని గుర్తించేందుకు ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 డిగ్రీ యాప్‌ను వినియోగించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ ఒకే వేదికపైకి తెచ్చిన ఈ యాప్ ద్వారా, ఈ నెల 3వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ బుల్లెట్ తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. అనంతరం స్థానిక పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
నేరాలకు చెక్ పెట్టేందుకు, నిఘా వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 డిగ్రీ యాప్‌ను ప్రవేశపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 14,692 సీసీ కెమెరాలు, 29 సర్వర్లను ఈ యాప్‌కు అనుసంధానించారు. తదుపరి దశలో కృత్రిమ మేధస్సు సాంకేతికతను కూడా జోడించారు. ఎక్కడ నేరం జరిగినా, సంబంధిత వివరాలను ఈ యాప్‌లో నమోదు చేస్తే, రాష్ట్రం లేదా సరిహద్దుల్లో ఎక్కడ ఉన్నా అనుసంధానమైన కెమెరాల ద్వారా వాహనాలు, నిందితుల కదలికలను గుర్తించి, ఆ సమాచారం అన్ని పోలీస్ స్టేషన్లకు చేరేలా వ్యవస్థను రూపొందించారు. కమాండ్ కంట్రోల్ కేంద్రాలకు కూడా పూర్తి సమాచారం పంపబడుతుంది.
ఈ యాప్ ద్వారా నేరస్థుల కదలికలను సులభంగా పసిగట్టవచ్చని, ఇందులో పొందుపరచిన సమాచారం 120 రోజులపాటు నిల్వ ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలో ఈ యాప్ సాయంతో బుల్లెట్ వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని పులివెందుల సీఐ శ్రీరామ్ పేర్కొన్నారు. నిందితులను తక్కువ సమయంలోనే గుర్తించి చర్యలు తీసుకోవడంలో ఈ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉందని ఆయన వివరించారు.













