రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: హిందూపురం మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను ఐచర్ వాహనం ఢీకొట్టిన ఈ ప్రమాదంలో 18 నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హిందూపురం పట్టణానికి చెందిన కొంతమంది ముస్లిం మైనార్టీ మహిళలు, పురుషులు ఇందిరమ్మ కాలనీలో జరిగిన పీర్ల పండుగ ఉత్సవాలకు వెళ్లారు. ఉత్సవాలు ముగిసిన అనంతరం తెల్లవారుజామున ఆటోలో తిరిగి హిందూపురం వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.
ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుకున్న సమయంలో మడకశిర నుంచి టమాటా లోడుతో వస్తున్న ఐచర్ వాహనం అతివేగంగా దూసుకొచ్చి బ్రిడ్జి మలుపు వద్ద ఆటోను ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు ఆటోలో ప్రయాణిస్తున్న 18 నెలల చిన్నారి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
అదే ప్రమాదంలో ఆటోలో ఉన్న ఐదుగురు మహిళలు, ఇద్దరు పురుషులు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు, పోలీసులు గాయపడిన వారిని వెంటనే 108 అంబులెన్స్ ద్వారా హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వైద్యులు గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. అయితే కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం, బెంగళూరు వైపు రిఫర్ చేసినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రమాదంపై కేసు నమోదు చేసిన హిందూపురం పోలీసులు, ఐచర్ వాహనం అతివేగం, బ్రిడ్జి మలుపు వద్ద డ్రైవింగ్ నిర్లక్ష్యం కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఘటనతో ఇందిరమ్మ కాలనీ, హిందూపురం పరిసరాల్లో విషాదం నెలకొంది. పీర్ల పండుగ ఉత్సవాల నుంచి తిరుగు ప్రయాణంలోనే ఇలాంటి దుర్ఘటన జరగడం స్థానికులను కలచివేసింది. ప్రమాదానికి కారణమైన ఐచర్ వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని, డ్రైవర్ వివరాలు సేకరిస్తున్నారు. చిన్నారి మృతి, పలువురి గాయాలపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.













