రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: రైతుల హక్కులను పరిరక్షిస్తూ, భూ యాజమాన్యానికి మరింత భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఓడి చెరువు మండల రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో డబురువారిపల్లి, తిప్పేపల్లి గ్రామాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి చేతుల మీదుగా 2,237 మంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. ఈ పాసుపుస్తకాలపై ప్రభుత్వ రాజముద్రతో పాటు సంబంధిత రైతు ఫోటో ముద్రించి ఇవ్వడం ద్వారా భూ యాజమాన్యంపై రైతులకు మరింత భరోసా కల్పించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోను ముద్రించి పంపిణీ చేశారని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి విమర్శించారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు గౌరవాన్ని కాపాడే విధంగా, రైతు ఫోటోతో పాటు ప్రభుత్వ అధికారిక రాజముద్ర కలిగిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేస్తోందని ఆమె వివరించారు.
“మన భూమి – మన హక్కు” అనే భావనతో రైతులకు వారి భూ హక్కులపై పూర్తి భరోసా కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. పుట్టపర్తి నియోజవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె పేర్కొన్నారు.
నియోజవర్గంలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో పుట్టపర్తిలో 5వ తరం ఫైటర్ జెట్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పుట్టపర్తి నియోజవర్గ అభివృద్ధి గేమ్ చెంజర్‌గా మారడం ఖాయమని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. అదే విధంగా ఆమడ గూరు మండలంలో రూ. 51 వేల కోట్ల వ్యయంతో అతి పెద్ద Reliance Solar విద్యుత్ ప్రాజెక్ట్ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంత అభివృద్ధితో పాటు వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆమె తెలిపారు.
అతి త్వరలో ఓడి చెరువు ప్రాంతానికి మరో Solar ప్రాజెక్టు రానున్నట్లు కూడా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు అమలులోకి వస్తే పుట్టపర్తి నియోజవర్గం పరిశ్రమల కేంద్రంగా, ఉపాధి అవకాశాల హబ్‌గా మారే అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు, మండల తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, RI శ్రీనివాస్ రెడ్డి, మండల కన్వీనర్ జయచంద్ర, మాజీ ZPTC పిట్టా ఓబుల రెడ్డి, సొసైటీ అధ్యక్షులు తుమ్మల మహబూబ్ బాషా, బోయపల్లి శివారెడ్డి, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నిజాం, కంచి సురేష్, కూటమి నాయకులు, మహిళా నాయకురాలు సుభాషిణి, డబురువారిపల్లి, తిప్పేపల్లి పంచాయతీ TDP కుటుంబ సభ్యులు, రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.













