రాయలసీమ న్యూస్, ఆదివారం మాగజైన్ డెస్క్: ఫాదర్స్ డే సందర్భంగా తండ్రీకొడుకుల అనుబంధాన్ని హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించిన ఈ కథ, నాన్న ప్రేమ ఎంత లోతైనదో, ఎంత నిశ్శబ్దమైనదో గుర్తుచేస్తుంది. పారుపల్లి అజయ్ కుమార్ రాసిన ఈ రచనలో, ఓ ముప్పై ఏళ్ల కొడుకు – ఆరుపదుల తండ్రిని సముద్ర తీరానికి తీసుకెళ్లి, జీవితాంతం తండ్రి గుండెల్లో దాచుకున్న భావోద్వేగాలను వెలికి తీస్తాడు.
బీచ్ వైపుగా నడుస్తూ, చిన్నప్పుడు కొడుకును చేయి పట్టుకుని నడిపించిన రోజులు తండ్రికి గుర్తుకొస్తాయి. ఇప్పుడు అదే చేయి తనను నడిపిస్తోందని తండ్రి మనసులో అలజడి మొదలవుతుంది. ఇసుకపై కూర్చున్న తర్వాత, కొడుకు మెల్లగా సంభాషణ మొదలుపెడతాడు. తండ్రి ఎప్పుడైనా ఏడ్చాడా అని అడుగుతాడు. దానికి తండ్రి, కొడుకును మొదటిసారి చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నానని చెబుతాడు. కొడుకు మొదటిసారి స్కూల్‌కి వెళ్లిన రోజు, గేటు దగ్గర చేతిని గట్టిగా పట్టుకుని “నువ్వూ రావాలి” అన్నప్పుడు తన కళ్లలో బాధతో నీరు నిలిచిందని తండ్రి గుర్తుచేసుకుంటాడు.
చిన్ననాటి జాతర జ్ఞాపకాలు, బెలూన్లు, మిఠాయిల కోసం కొడుకు చేసిన మారాం, తండ్రి జేబులు ఖాళీ అయినా, భుజాలపై ఎక్కించుకుని నడుచుకుంటూ ఇంటికి తీసుకెళ్లిన సంఘటనలు తండ్రీకొడుకులిద్దరికీ మళ్లీ మళ్లీ గుర్తుకొస్తాయి. కొన్ని బరువులు అలసట ఇవ్వవని, ఆనందం ఇస్తాయని తండ్రి చెప్పిన మాటలు కొడుకును కదిలిస్తాయి.
కొడుకు హాస్టల్‌కి వెళ్లిన రోజు బస్ వెళ్లిపోయాక ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి, ఇంట్లో ఖాళీగా మిగిలిన గది చూసి ఎన్నోసార్లు మౌనంగా బాధపడ్డాడు. తన బాధలను పిల్లలతో పంచుకోకుండా, భార్య ఫొటోతో మనసు విప్పుకున్నాడు. కొడుకు టెన్త్ పరీక్షల సమయంలో రాత్రిళ్లు నిద్రపోక టెన్షన్ పడుతున్నప్పుడు, గదిలో లైట్ ఆఫ్ అయినా, నిట్టూర్పులు తన గుండెలకు వినిపించాయని తండ్రి చెబుతాడు. కొడుకు పిలిస్తాడేమోనని గది తలుపు దగ్గర రాత్రంతా కూర్చున్నానని, కానీ అతడు ఒంటరిగా పోరాడటం నేర్చుకోవాలని మౌనంగా ఉండిపోయానని వెల్లడిస్తాడు.
తండ్రి ప్రేమ మాటల్లో కాకుండా బాధ్యతల్లో కనిపిస్తుందని, కొడుకు పడిపోయిన ప్రతిసారీ ఎత్తుకోవాలనిపించినా, జీవితంలో ఎప్పుడూ తనతో ఉండలేనని తెలుసుకుని, అతడే లేచే వరకు ఎదురు చూసిన సందర్భాలను తండ్రి వివరిస్తాడు. పిల్లల భవిష్యత్తు కోసం తండ్రులు అనుక్షణం భయపడుతూనే ఉంటారని, తమ అసమర్థతపై కోపం తెచ్చుకుంటారని, స్కూల్ ఫీజు కట్టాల్సిన రోజుల్లో బస్ ఛార్జీలకే డబ్బులు మిగలకపోయినా, పిల్లల ముందు ఆ కష్టాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తారని చెబుతాడు.
తన చిన్ననాటి కలలైన సంగీతం నేర్చుకోవడం, పెద్ద సింగర్ కావడం కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల నెరవేరలేదని తండ్రి చెప్పినప్పుడు, కొడుకు మనసు ముదురుతుంది. అయితే, తాను కోల్పోయిన దానికంటే విలువైనదాన్ని – కొడుకును – పొందానని తండ్రి స్పష్టం చేస్తాడు. కొడుకు మంచి షూస్ వేసుకుంటే, తానూ కొత్త చెప్పులు వేసుకున్నట్టే అనిపించేదని, పిల్లల కోసం ఖర్చు చేయడమే తన సంతోషమని తండ్రి భావోద్వేగంతో చెబుతాడు.
ఇంజినీరింగ్ పూర్తయ్యాక ప్రేమ వివాహం విషయమై తండ్రీకొడుకుల మధ్య జరిగిన వాగ్వాదాన్ని కూడా తండ్రి ఎంతో పెద్ద మనసుతో మరిచిపోయాడు. కోపంలో ఉన్న కొడుకును గెలవడం కాదు, అతడిని అర్థం చేసుకోవడమే నిజమైన గెలుపు అని తండ్రి చూపించాడు. మొదటి జీతంతో కొడుకు కొనిచ్చిన షర్ట్‌ను, తన పెంపకానికి వచ్చిన గౌరవంగా భావించిన తండ్రి, తన కోరికలన్నీ కొడుకులోనే నెరవేరినట్టు భావిస్తాడు.
పగలంతా కష్టపడి వచ్చి తలుపు తట్టినప్పుడు, “నాన్నా” అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకునే కొడుకు, తనకు ఇచ్చిన నిజమైన నీడ అని తండ్రి చెబుతాడు. కన్నీళ్లు బలహీనత కాదని, మనసు ఇంకా బతికే ఉందనడానికి గుర్తని తండ్రి మాటలు, కొడుకును మరింతగా కదిలిస్తాయి.
ఈ భావోద్వేగాలన్నింటి చివర్లో, కొడుకు జీవితాన్ని మార్చే వార్త చెబుతాడు. తాను తండ్రి కాబోతున్నానని, తండ్రి తాతయ్య కాబోతున్నాడని తెలియజేస్తాడు. తనకూ తండ్రిలాగే మంచి నాన్నగా మారాలని ఆశిస్తూ, తండ్రిని గట్టిగా కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రి మౌనంగా కొడుకు వీపు నిమురుతూ, తన ప్రేమను మళ్లీ మాటలకతీతంగా వ్యక్తం చేస్తాడు.
తండ్రి ప్రేమ చెమటలో కనిపించే ప్రేమ. త్యాగంలో దాగి ఉండే అనురాగం. నిశ్శబ్దంలో వినిపించే మమకారం. కొడుకు చిన్నప్పుడు తండ్రి వేలును పట్టుకుంటాడు. తండ్రి వృద్ధాప్యంలో అదే కొడుకు చేయి పట్టుకుంటాడు. ఇదే తండ్రీకొడుకుల అనుబంధం అని ఈ కథ మనసును తడిపేస్తుంది.




