బిర్యానీలో ఈగ..

హోటల్ నిర్లక్ష్యంపై కోర్టు సీరియస్‌

జరిమానాతో పాటు 10 ప్లేట్ల బిర్యానీ ఫ్రీ ఆర్డర్

పుదుచ్చేరిలో బిర్యానీలో ఈగ కలిసివచ్చిన ఘటనపై జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కీలక తీర్పు ఇచ్చింది. హోటల్ సేవల్లో నిర్లక్ష్యం నిరూపితమైందని పేర్కొంటూ, బాధిత కస్టమర్‌కు నగదు పరిహారంతో పాటు 10 ప్లేట్ల నాణ్యమైన హైదరాబాద్ చికెన్ బిర్యానీని ఉచితంగా అందించాలని ఆదేశించింది. ఈ విచిత్ర తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళ్తే.. పుదుచ్చేరిలోని ఎంజీ రోడ్డులో ఉన్న ‘బిర్యానీ & కో’ రెస్టారెంట్‌కు పి. సుందరకుమార మణికందన్ అనే కస్టమర్ తన స్నేహితుడు మహమ్మద్ నియాసుద్దీన్‌తో కలిసి 2025 డిసెంబర్ 8న బిర్యానీ తినడానికి వెళ్లాడు. బిర్యానీ తినబోయే సమయంలో ప్లేటులో చచ్చిపోయిన ఈగ కనిపించింది. దీనితో అతను దిగ్భ్రాంతికి గురయ్యాడు.

హోటల్‌లోని అపరిశుభ్రత, సిబ్బంది నిర్లక్ష్యాన్ని మణికందన్ తన మొబైల్ ఫోన్‌లో వీడియోలు, ఫోటోల రూపంలో రికార్డ్ చేశాడు. ఆహార భద్రతపై అనుమానాలు, ఆరోగ్యంపై భయం కలిగిన అతను చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యాడు. ముందుగా రెస్టారెంట్‌కు నోటీసులు పంపినా, అక్కడి యాజమాన్యం నుంచి తగిన స్పందన రాలేదని ఆయన పేర్కొన్నాడు.

దీంతో మణికందన్ పుదుచ్చేరి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు. హోటల్ నిర్లక్ష్యం, తనకు కలిగిన మానసిక క్షోభ, కోర్టు ఖర్చుల పేరుతో మొత్తం రూ.1.30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కోర్టు నోటీసులు పంపినా రెస్టారెంట్ యాజమాన్యం విచారణకు హాజరుకాకపోవడంతో కేసు ఏకపక్షంగా కొనసాగింది.

విచారణ సమయంలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. మణికందన్ గూగుల్‌లో పెట్టిన రివ్యూకు స్పందిస్తూ రెస్టారెంట్ నిర్వహణ అక్కడ జరిగిన తప్పును అంగీకరించింది. ఆ రివ్యూకు సమాధానంగా వారు

అని రాసినట్లు రికార్డుల్లో బయటపడింది. అయితే అదే విషయంపై పంపిన లీగల్ నోటీసుకు మాత్రం తమ తప్పులేదని రెస్టారెంట్ తరఫు నుంచి సమాధానం ఇచ్చారు. ఈ విరుద్ధమైన వాదనలను కోర్టు గమనించింది.

కస్టమర్ సమర్పించిన వీడియో, ఫోటో ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం, అక్కడ ఆహార భద్రతా ప్రమాణాలు పాటించలేదని తేల్చింది. వినియోగదారుల రక్షణ చట్టం–2019 ప్రకారం హోటల్ సేవల్లో లోపం ఉన్నట్లు కమిషన్ నిర్ణయించింది.

దీంతో ‘బిర్యానీ & కో’ రెస్టారెంట్ బాధితుడికి మానసిక వేదనకు గానూ రూ.10 వేల పరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.3 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశించింది. అదనంగా, రాబోయే ఐదు ఆదివారాల పాటు, ప్రతి వారం రెండు ప్లేట్ల చొప్పున మొత్తం 10 ప్లేట్ల నాణ్యమైన, వేడివేడి హైదరాబాద్ చికెన్ బిర్యానీని మణికందన్‌కు ఉచితంగా అందించాలంటూ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.

ఈ తీర్పు, వినియోగదారుల హక్కులను తేలికగా తీసుకునే హోటళ్లకు హెచ్చరికగా మారిందని న్యాయవర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఆహార భద్రత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని ఈ కేసు మరోసారి స్పష్టం చేసింది.