రాయలసీమ న్యూస్, తమిళనాడు డెస్క్:
విడాకుల్లో తమిళనాడు టాప్
దేశవ్యాప్తంగా విడాకులు తీసుకున్న వారి జనాభాలో తమిళనాడు అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టం (ఎస్ఆర్ఎస్) తాజా నివేదికలో ఈ విషయాలు బయటపడ్డాయి. 2024లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు 5.81లక్షల మందిని కలిసి వివిధ అంశాలపై వివరాలు సేకరించగా, వాటి ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు.
ఆ వివరాల ప్రకారం విడాకులు తీసుకున్నవారి జనాభా రాష్ట్రంలో 7.2శాతంగా ఉంది. ఇందులో మగవారు 2.9శాతం మాత్రమే ఉండగా, ఆడవారు 11.6శాతంగా నమోదయ్యారు. భాగస్వామి నుంచి వేరుగా ఉంటున్నట్లు వీరంతా స్పష్టంగా తెలిపినట్టు నివేదిక పేర్కొంది. పెళ్లయిన వారి జనాభా రాష్ట్రంలో 51.9శాతంగా ఉండి, ఇది దేశంలోనే అత్యధికం. ముఖ్యంగా మగవారిలో పెళ్లయినవారి శాతం 57.3గా ఉండటంతో, ఈ విషయంలోనూ తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో నిలిచింది.
వివాహాల విషయంలో ఆలస్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉందని నివేదిక సూచిస్తోంది. ప్రత్యేకించి మహిళల విషయంలో 21ఏళ్ల వయసు దాటిన తర్వాతే ఎక్కువగా వివాహాలు జరుగుతున్నాయి. పెళ్లయిన మహిళల్లో 21ఏళ్లకు పైబడిన వయసులోనే వివాహం అయినవారు 81శాతం ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ శాతం మరింత ఎక్కువగా ఉంది. 18-20ఏళ్ల మధ్య వివాహం చేసుకున్నవారు 18.2శాతం, 18ఏళ్లలోపు పెళ్లిళ్లు జరిగిన వారు 0.8శాతంగా నమోదయ్యారు.
రాష్ట్ర ప్రజల విద్యార్హతల పరంగా చూస్తే నిరక్షరాస్యులు 2.3శాతం, ప్రాథమిక విద్య 8.0శాతం, మాధ్యమిక 13.7శాతం, పదో తరగతి 22.1శాతం, ప్లస్‌టూ 23.3శాతం, డిగ్రీ, అంతకుమించిన విద్య 26.4శాతం, ఇతరత్రా 4.2శాతంగా ఉన్నట్లు ఎస్ఆర్ఎస్ నివేదిక వెల్లడించింది. చదువుకున్న వారిలో మహిళల శాతం గణనీయంగా ఎక్కువగా ఉండటం విశేషం. అక్షరాస్యుల్లో డిగ్రీ, అంతకుమించిన చదువులు పూర్తి చేసిన మహిళలు 69.8శాతం, ప్లస్‌టూ చదివినవారు 48.4శాతంగా ఉన్నట్లు తేలింది.
సంతానోత్పత్తి, జనాభా నిర్మాణంలోనూ రాష్ట్రం కీలక మార్పులను చూస్తోంది. ప్రతి వెయ్యిమంది మగవారికి తమిళనాడులో 936మంది ఆడవారు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి 926గా ఉండగా, పట్టణాల్లో 944గా ఉంది. దీంతో పట్టణాల్లో ఆడవారి జనాభా కొంత ఎక్కువగా ఉందని నివేదిక సూచిస్తోంది. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు (జనరల్ ఫెర్టిలిటీ రేషియో) గత 10ఏళ్లలో 24.3శాతం తగ్గింది. 2012-14లో ఇది 55.6గా ఉండగా, 2022-24లో 42.1కి పడిపోయింది. ఈ తగ్గుదల రానున్న జనాభా లెక్కలపై ప్రభావం చూపే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
0-4ఏళ్ల వయసు పిల్లలు రాష్ట్ర మొత్తం జనాభాలో 5.7శాతంగా మాత్రమే ఉండటం గమనార్హం. పట్టణాల్లో ఈ వయసు పిల్లల శాతం 5.9గా ఉంది. పట్టణాల్లో ఆడపిల్లలు 5.6శాతం, మగపిల్లలు 6.2శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది. 0-14ఏళ్ల వయసు పిల్లలు 18శాతం, 15-59ఏళ్ల మధ్య వయసు గల వారు 67.8శాతం, 60ఏళ్లకు పైబడినవారు 14.2శాతం ఉన్నట్లు అంచనా వేశారు. వృద్ధుల శాతం పట్టణాల్లోనే ఎక్కువగా నమోదైంది.
శిశుమరణాల రేటు విషయంలో మాత్రం రాష్ట్రం గణనీయమైన పురోగతి సాధించింది. 2012-14లో ప్రతి వెయ్యిమంది పుట్టిన శిశువుల్లో 20.8మంది మరణిస్తుండగా, ప్రస్తుతం అది 11.2కి తగ్గింది. అంటే శిశుమరణాలు 46.2శాతం మేరకు తగ్గినట్లు ఎస్ఆర్ఎస్ నివేదికలో పేర్కొన్నారు.







