రాయలసీమ న్యూస్, తమిళనాడు డెస్క్:
విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది..
ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు..
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వం ఐదేళ్ల పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయదని స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే మూడు నుంచి ఆరు నెలల్లో విజయ్ మైనారిటీ ప్రభుత్వం కూలిపోవచ్చని స్టాలిన్ అన్నారు.
తాజాగా డీఎంకేలో కొందరు కార్యకర్తల చేరిక సందర్భంగా నిర్వహించిన సమావేశంలో స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం స్థిరంగా కనిపించడం లేదని, రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారతాయో వేచి చూడాలని అన్నారు. 'మా ప్రగతిశీల కూటమిలోని కొన్ని పార్టీల వ్యూహాత్మక పొత్తు, మద్దతు వల్లే ఈ టీవీకే ప్రభుత్వం మనుగడ సాగించగలుగుతోంది' అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
'ఇది అస్థిరమైన ఏర్పాటు. ఈ వాహనం ఏ కూడలిలో అకస్మాత్తుగా ఆగిపోతుందో మనకు తెలియదు. అందుకే నేను మీకు చెబుతున్నాను.. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు. అవి మూడు నెలల్లో జరగవచ్చు, లేదా ఆరు నెలల్లో జరగవచ్చు. ఐదేళ్ల కాలం పాటు వేచి ఉండే స్థితిలో మనం లేము. ఎలాంటి రాజకీయ పరిస్థితికైనా నూటికి నూరు శాతం మనం సిద్ధంగా ఉండాలి' అని కార్యకర్తలకు స్టాలిన్ సూచించారు.







