రాయలసీమ న్యూస్, టెక్నాలజీ డెస్క్: యాపిల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్ లాంచ్‌కు సంబంధించి కీలక సమాచారం లీక్స్ రూపంలో బయటకు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక క్రేజ్ ఉన్న మొబైల్ బ్రాండ్‌గా యాపిల్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, అప్‌డేట్లతో తన ఐఫోన్ సిరీస్‌ను మార్కెట్‌లోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐఫోన్ 17 సిరీస్‌కు మంచి స్పందన రావడంతో, ఇప్పుడు ఐఫోన్ 18 సిరీస్‌పై దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
కొన్ని నివేదికల ప్రకారం యాపిల్ తన ఫేవరెట్ మంత్ అయిన సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 18 సిరీస్‌ను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది. యాక్యురేట్‌గా చూస్తే సెప్టెంబర్ 8 లేదా 9 తేదీల్లో జరగనున్న వార్షిక ఈవెంట్‌లో ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్స్‌ను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్టు లీక్స్ సూచిస్తున్నాయి. ఈ మోడల్స్ సెప్టెంబర్ 18 నుంచి మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చని సమాచారం.
ఈసారి యాపిల్ కొత్త వ్యూహాన్ని అవలంబించనున్నట్టు టెక్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నివేదికల ప్రకారం సెప్టెంబర్‌లో కేవలం ప్రో మోడల్స్ మరియు ఫోల్డబుల్ ఐఫోన్‌ను మాత్రమే విడుదల చేసి, ఇతర మోడల్స్ అయిన ఐఫోన్ 18, ఐఫోన్ 18e లను 2027 ప్రారంభంలో లాంచ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఫోల్డబుల్ మోడల్ రూపంలో యాపిల్ కొత్త సెగ్మెంట్‌లో అడుగుపెట్టబోతుందనే ఊహాగానాలు బలపడుతున్నాయి.
డిజైన్ పరంగా చూస్తే ఐఫోన్ 18 సిరీస్‌లో పెద్ద మార్పులు ఉండబోవని లీక్స్ చెబుతున్నాయి. ఇప్పటివరకు ఉన్న ఫ్లాట్ ఎడ్జ్ లుక్‌ను కొనసాగిస్తూ అదే డిజైన్‌తో 18 సిరీస్ వస్తుందని సమాచారం. అయితే బ్యాక్ కెమెరా మాడ్యూల్ సైజు కాస్త పెరగనుందనే అంచనాలు ఉన్నాయి. ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం, అప్‌గ్రేడెడ్ కూలింగ్ సిస్టమ్ కారణంగా ఫోన్ మందం, బరువు కొద్దిగా పెరిగే అవకాశం ఉందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే ఈసారి సిగ్నేచర్ కలర్‌గా డార్క్ చెర్రీని తీసుకురానున్నట్టు లీక్స్ వెల్లడిస్తున్నాయి. అదనంగా లైట్ బ్లూ, సిల్వర్, డార్క్ గ్రే రంగుల్లో కూడా ఐఫోన్ 18 ప్రో సిరీస్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది.
పర్ఫార్మెన్స్ పరంగా ఐఫోన్ 18 సిరీస్ కీలక అప్‌గ్రేడ్‌ను అందుకోనుంది. యాపిల్ TSMC కంపెనీకి చెందిన అడ్వాన్స్‌డ్ 2nm ప్రాసెస్ సాంకేతికతతో తయారైన A20 ప్రో చిప్‌ను ఈ సిరీస్‌లో ఉపయోగించనున్నట్టు సమాచారం. ఈ చిప్ ఫోన్ స్పీడ్, గేమింగ్ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు శక్తివంతమైన ఆన్-డివైజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లకు సపోర్ట్ ఇవ్వనుందని టెక్ లీక్స్ పేర్కొంటున్నాయి.
కెమెరా విభాగంలో కూడా మార్పులు కనిపించనున్నాయి. ఐఫోన్ 18 ప్రోలో సరికొత్త వేరియబుల్ అపెర్చర్ లెన్స్‌ను యాపిల్ ప్రవేశపెట్టనుందని సమాచారం. దీని వల్ల లోలైట్ పరిస్థితుల్లో కూడా మెరుగైన ఫోటోలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మెరుగైన టెలిఫోటో లెన్స్, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందుబాటులోకి రానున్నట్టు లీక్స్ చెబుతున్నాయి. ఫోన్ సైడ్‌లో ఉండే కెమెరా కంట్రోల్ బటన్‌ను పూర్తిగా ప్రెజర్-సెన్సిటివ్‌గా మార్చే యోచనలో యాపిల్ ఉన్నట్టు తెలుస్తోంది.
బ్యాటరీ సామర్థ్యం ఈసారి ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. ఐఫోన్ 18 సిరీస్‌లో 5,500mAh బ్యాటరీని యాపిల్ అందించనున్నట్టు లీక్ సమాచారం. దీని వల్ల బ్యాటరీ బ్యాకప్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా.
ధరల విషయానికి వస్తే భారత్‌లో ఐఫోన్ 18 సిరీస్ ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పెరిగిన తయారీ ఖర్చులు, కొత్త 2nm చిప్, కెమెరా హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌ల కారణంగా ఈసారి ఐఫోన్ ధరలు సుమారు రూ. 5,000 వరకు ఎక్కువగా ఉండొచ్చని లీక్స్ పేర్కొంటున్నాయి. ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర సుమారు రూ. 1,39,900గా, ఐఫోన్ 18 ప్రో మాక్స్ ప్రారంభ ధర సుమారు రూ. 1,54,900గా ఉండే అవకాశం ఉందని టెక్ నివేదికలు సూచిస్తున్నాయి.
ఈ ఫోన్లు సరికొత్త iOS 27 సాఫ్ట్‌వేర్, అప్‌డేటెడ్ Siri AI ఫీచర్లతో మార్కెట్‌లోకి రానున్నట్టు సమాచారం. అయితే ఇవన్నీ ప్రస్తుతం లీక్స్, ఊహాగానాల స్థాయిలో ఉన్న వివరాలే కావడంతో, యాపిల్ అధికారిక ప్రకటన కోసం టెక్ ప్రపంచం ఎదురుచూస్తోంది.







