రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
విస్తృత ఏర్పాట్లు..
హైదరాబాద్: నగరంలో జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. ఈసారి లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
చేప ప్రసాదం 2026 సందర్భంగా చేప ప్రసాదం పంపిణీకి సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి వివరాలు వెల్లడించారు. చేప ప్రసాదం కార్యక్రమం ప్రజల విశ్వాసంతో ముడిపడి ఉన్నదని, ఎలాంటి ప్రచారం చేయకపోయినా దేశం నలుమూలల నుంచి వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా హాజరవుతున్నారని వారు తెలిపారు. చేప ప్రసాదం గురించి అనవసర అపోహలు వ్యాప్తి చెందకుండా చూడాలని, ఈ ప్రసాదం వల్ల ప్రయోజనం పొందిన వారే స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి ప్రచారం చేస్తున్నారని వారు పేర్కొన్నారు. శాస్త్రానికి అంతుచిక్కని అనేక అంశాలు ఉన్న నేపథ్యంలో, అపోహలకు తావు ఇవ్వకుండా ప్రజలు నమ్మకంతో కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
ఈసారి చేప ప్రసాదం కోసం మూడు లక్షలకు పైగా చేపపిల్లలను సిద్ధం చేసినట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. అంచనా వేస్తున్న భక్తుల సంఖ్యకు అనుగుణంగా చేపపిల్లలను సమకూర్చినట్లు చెప్పారు. చివరి వ్యక్తి వరకు చేప ప్రసాదం అందేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. జూన్ 8వ తేదీ రాత్రి 9 గంటలకు చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమై, జూన్ 9వ తేదీ సాయంత్రం వరకు నిరంతరంగా కొనసాగుతుందని మంత్రి తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి మరింత సంఖ్యలో కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక మార్గదర్శకాలు, సదుపాయాలు కల్పించినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమం సజావుగా సాగేందుకు 200 మందికి పైగా మత్స్యశాఖ సిబ్బంది పాల్గొని సేవలు అందించనున్నారని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని అవసరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, అందరికీ సకాలంలో చేప ప్రసాదం అందేలా పర్యవేక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు.







