రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
ఐటీ కారిడార్‌లో ఫుడ్ సేఫ్టీ దాడులు: ప్రముఖ రెస్టారెంట్ల అసలు రంగు బయటకు
హైదరాబాద్: భాగ్యనగరంలోని ఐటీ కారిడార్ పరిసరాల్లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్లలో పరిశుభ్రత పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు బయటపడింది. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాల్లోని హోటళ్లపై సైబరాబాద్ CMC ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బడా రెస్టారెంట్ల వంటగదులను పరిశీలించిన అధికారులు అక్కడి అపరిశుభ్ర వాతావరణం, నాణ్యతా లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాల వినియోగం వంటి అంశాలను గుర్తించారు.
గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్న ప్రముఖ బిర్యానీ కేంద్రం Shah Ghouse రెస్టారెంట్ వంటగదిలో పరిస్థితులు అధికారులు పరిశీలించారు. కిచెన్ అంతా ఈగలు ముసిరి ఉండటం, అత్యంత అపరిశుభ్రంగా కనిపించడం, కిచెన్ పరిసరాల్లో డ్రెయిన్లు తెరిచి ఉంచడం, లేబుళ్లు లేని ఆహార పదార్థాలను నిల్వ ఉంచడం వంటి అంశాలపై అధికారులు తీవ్రంగా స్పందించారు. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాల ఆధారంగా నిర్వహించిన హైజీన్ రేటింగ్‌లో ఈ హోటల్ కేవలం 65 శాతం స్కోర్ మాత్రమే సాధించడంతో యాజమాన్యానికి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు జారీ చేశారు.
హైటెక్ సిటీలోని Mehfil రెస్టారెంట్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తడి నేలపైనే ఆహార వ్యర్థాలను పడేయడం, ఒకపక్క భవన నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే Roomali Roti తయారు చేయడం వంటి అంశాలు అక్కడి హైజీన్ ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. అదనంగా, అక్కడి సిబ్బందికి మెడికల్ సర్టిఫికెట్లు లేకపోవడం కూడా అధికారులు నమోదు చేశారు. ఈ హోటల్‌కు 67 శాతం స్కోర్ కేటాయించి, సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
మాదాపూర్‌లోని Ideal Kitchenలో నిర్వహించిన తనిఖీల్లో ఫ్రీజర్‌లో నిల్వ ఉంచిన పిండివంటలపై బొద్దింకలు తిరుగుతూ కనిపించాయి. వంటకు ఉపయోగించే మినప్పప్పులో పురుగులు ఉండటం అధికారులు గుర్తించారు. ముడి పదార్థాల నిల్వలో తీవ్ర లోపాలు ఉన్నట్లు తేలడంతో, ఈ హోటల్‌కు కూడా 67 శాతం స్కోర్ ఇచ్చి నోటీసులు జారీ చేశారు.
కొండాపూర్‌లోని Palamuru Grillలో లేబుల్ ట్యాంపరింగ్ చేసినట్లు, గడువు ముగిసిన Mushrooms వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న పాత ఆహార పదార్థాలను వెంటనే పారవేయించారు. తుప్పు పట్టిన ఫ్రీజర్లు, ఈగలతో నిండిన వంటగది పరిస్థితులు అధికారులను దిగ్భ్రాంతికి గురి చేశాయి. ఈ హోటల్‌కు కేవలం 60 శాతం స్కోర్ కేటాయించి, యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు.
ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా నిబంధనలు ఉల్లంఘించే హోటళ్లపై కఠిన చర్యలు తప్పవని, ఫుడ్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేనని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం. ఐటీ కారిడార్‌లో తరచుగా బయట భోజనం చేసే ఉద్యోగులు, కుటుంబాల ఆరోగ్య రక్షణ కోసం ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.







