రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: తెలంగాణలో ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు, ఆయిల్ పామ్ సాగు విస్తరణ తదితర అంశాలపై గోద్రేజ్ ఆగ్రోవెట్ కంపెనీ ప్రతినిధులు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ప్రైవేటు సమీకృత ఆయిల్ పామ్ సాగు విస్తరణపై కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా నివేదికను ముఖ్యమంత్రికి అందజేశారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో జరిగిన ఈ సమావేశంలో గోద్రేజ్ గ్రూపు సంస్థల కార్పొరేట్ అఫేర్స్ ప్రెసిడెంట్ రాకేష్ స్వామి, ఆగ్రోవెట్ ఆయిల్ పామ్ బిజినెస్ సీఈఓ సౌగత నియోగి ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు విస్తరణకు సంబంధించిన తమ ప్రణాళికలను, పెట్టుబడుల వివరాలను ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు.
ఖమ్మం జిల్లాలో ₹300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టు ద్వారా 700 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్, నర్సరీ, పరిశోధన–అభివృద్ధి కేంద్రం, సీడ్ గార్డెన్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం గుబ్బగుర్తి గ్రామంలో 113.5 ఎకరాల భూమిని ప్రభుత్వం ఇప్పటికే కేటాయించినట్లు సమావేశంలో వివరించారు.
సీడ్ గార్డెన్ విస్తరణ కోసం అదనంగా మరో 35 నుంచి 40 ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వం తమను అనుకూలంగా పరిశీలించాలని కంపెనీ ప్రతినిధులు కోరారు. ప్రాసెసింగ్ యూనిట్‌కు అనుసంధానంగా రవాణా సౌకర్యాలు మెరుగుపర్చేందుకు రహదారిని విస్తరించాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించారు.
ప్రతినిధుల అభ్యర్థనలపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రాసెసింగ్ యూనిట్‌కు అవసరమైన రహదారి విస్తరణ పనులను టీజీఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణతో పాటు వ్యవసాయ రంగంలో విలువ ఆధారిత ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందజేస్తోందని సమావేశం అనంతరం అధికార వర్గాలు పేర్కొన్నాయి.







