రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే శైలి, ఆయన తాజా వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిన్న జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో సీఎం చేసిన వ్యాఖ్యలు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తికి తగినవిగా లేవని, అవి సైకో, శాడిస్ట్ ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని హరీష్ రావు మండిపడ్డారు.
రాష్ట్రంలో ఎండల కారణంగా పొలాలు ఎండిపోతుండగా, రైతుల పంటలు ఎండిపోకుండా సాగునీరు ఇవ్వాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయని, అయితే ముఖ్యమంత్రి మాత్రం ఆ సమస్యకు సమాధానం చెప్పకుండా నోటికి వచ్చినట్లు అసభ్యకరమైన పదజాలం ఉపయోగిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటల్లో అబద్ధాలు, బూతులు, శాపనార్థాలు తప్ప ప్రజల సమస్యలపై చర్చ కనిపించడం లేదని హరీష్ రావు ధ్వజమెత్తారు.
పొలాలకు నీళ్లు పారించమని కోరితే, ప్రతిపక్షాల రక్తం పారిస్తామని ముఖ్యమంత్రి మాట్లాడటం అత్యంత బాధాకరమని, అంగీకరించలేని వ్యాఖ్యలని హరీష్ రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.
“రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి ప్రతిపక్షాల రక్తం అడుగుతారా? ప్రజల కోసం అవసరమైతే మా రక్తం ఇస్తాము. నిన్న షాబాద్‌లో జరిగిన ఘోర ఉదంతంలో నరహంతకుడైన రాజ్‌కుమార్‌కు, ఇలా రక్తం పారిస్తామంటున్న ఈ ముఖ్యమంత్రికి తేడా ఏంటి?”
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్లే ఇలాంటి అసభ్యకరమైన బూతులు మాట్లాడుతున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. షాబాద్‌లో జరిగిన దారుణ ఘటనపై పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తే, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం ఆ ఘటనపై స్పందించకుండా రాజకీయ విమర్శలు, బూతులు మాట్లాడటానికే ప్రాధాన్యత ఇచ్చారని ఆయన విమర్శించారు.
రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన అసభ్యకర వ్యాఖ్యలను టెలివిజన్ ఛానళ్లలో ఒకసారి రివైండ్ చేసి చూసుకోవాలని, ఆ వ్యాఖ్యలు విన్న తర్వాతైనా రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
“నీకు మా రక్తం కావాలా.. అయితే తీసుకో, దానికి మేము సిద్ధం. కానీ ఎండిపోతున్న రైతుల పొలాలకు మాత్రం తక్షణమే సాగునీరు పారించు”
రైతుల సమస్యలను పక్కన పెట్టి, ప్రతిపక్షాలపై వ్యక్తిగత దూషణలు, బెదిరింపులు చేయడం ముఖ్యమంత్రి బాధ్యతలకు విరుద్ధమని, వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ప్రజలకు, ప్రతిపక్షాలకు క్షమాపణ చెప్పాలని హరీష్ రావు కోరారు.







