రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో విషాదం..
ఆరో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ విద్యాసంస్థ గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ కంప్యూటర్ సైన్స్ చదువుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి అనిరుధ్.. క్యాంపస్ భవనం ఆరో అంతస్తు నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న విద్యార్థి మృతదేహాన్ని.. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఖమ్మంలో ఉంటున్న విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కొడుకు ఉన్నత చదువులు చదువుకుని ప్రయోజకుడవుతాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు ఈ వార్త కోలుకోలేని శోకాన్ని మిగిల్చింది.
ఇదిలా ఉంటే.. అనిరుధ్ ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాడా, లేక కుటుంబంలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, లేక మరేదైనా బలమైన కారణం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు అనిరుధ్ బస చేసిన హాస్టల్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్కడ ఏమైనా సూసైడ్ నోట్ దొరుకుతుందేమోనని వెతుకుతున్నారు. అలాగే అతడి స్నేహితులు, తోటి విద్యార్థులు, లెక్చరర్లను విచారించి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు.







