రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
మూసీ పునరుజ్జీవనకు టి.సర్కార్ గ్రీన్ సిగ్నల్..
రూ.7,345 కోట్ల ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ తొలి దశ పనులకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.7,345.12 కోట్ల పరిపాలనా అనుమతులు ఇస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జోన్-1ఏ, జోన్-1బీ ప్రాధాన్య కారిడార్లలో మూసీ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 9.20 కి.మీ., ఉస్మాన్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 11.80 కి.మీ. మేర అభివృద్ధి పనులు కొనసాగనున్నాయి. మొత్తం 21 కి.మీ. ప్రాధాన్య స్ట్రెచ్‌లో రివర్‌ఫ్రంట్ పనులు జరుగనున్నాయి.
భూసేకరణ వ్యయం మినహా రూ.7,345.12 కోట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో ఏడీబీ నుంచి రూ.4,500 కోట్ల రుణాన్ని తీసుకోనుండగా.. మిగతా రూ.2,845.12 కోట్లు HMDA లేదా TGIIC నుంచి రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మూసీ రివర్‌ఫ్రంట్ పనులను ఈపీసీ (EPC) విధానంలో నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పర్యవేక్షణకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెన్సీ(PMC) నియామకానికి సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్‌ఆర్‌డీసీఎల్(MRDCL)కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.







