రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం ఓ యువకుడిని ఆటోతో ఢీకొట్టి నిన్న హత్య చేయగా.. అందుకు ప్రతీకారంగా మృతుడి బంధువులు అతని హత్యకు కారకుడైన వ్యక్తి తండ్రిని రాత్రి హత్య చేశారు. ఈ ఘటన మెదక్ జిల్లాలో సంచలనం కలిగించింది. చిన్న శంకరంపేట మండలంలోని సూరారం గ్రామానికి చెందిన శ్రీధర్ సోమవారం చేగుంట మండలం అనంతసాగర్‌కు బైక్‌పై వెళ్తుండగా ఆటోతో ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సూరారం గ్రామానికి చెందిన రణబోయిన ప్రభాకర్.. పాత కక్షల నేపథ్యంలో పథకం ప్రకారం చంపేశాడని మృతుని బంధువులు ఆందోళనకు దిగారు.
తమను న్యాయం జరిగేవరకు మృతదేహాన్ని తీసుకెళ్లమని తేల్చి చెప్పారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ నచ్చజెప్పడంతో మృతదేహాన్ని తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మాసాయిపేటలోని ఓ దాబా వద్ద శ్రీధర్ బంధువులకు ప్రభాకర్ తండ్రి యాదగిరి కనిపించడంతో ఆగ్రహంతో ఉన్నవారు అతనిపై దాడి చేశారు. అక్కడి నుంచి తీసుకెళ్లి బండరాయితో కొట్టి హల్దీ వాగులో పడేశారు. దీంతో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు వాగులో నుంచి యాదగిరి మృతదేహాన్ని బయటకు తీసి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా... యాదగిరిని హత్య చేసిన వారు పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం.







